ఎమ్మెల్యేలకు భారీ ఆఫర్.. కాషాయ తీర్థం పుచ్చుకుంటే రూ. 50 కోట్లు!

Operation Kamala.. గోవాలో రాజకీయం సంచలనంగా మారింది. అధికార బీజేపీలో కాంగ్రెస్ నేతలు చేరుతున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా బరిలో నిలిచిన దిగంబర్ కామత్, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు.. బీజేపీతో టచ్‌లో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లుకొడుతున్నాయి
ఈ నేపథ్యంలో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య.. బీజేపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోవాలో కాంగ్రెస్ నేతలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తోందని మండిపడ్డారు. బీజేపీలో చేరేందుకు ఒక్కో కాంగ్రెస్ నేతకు.. కాషాయ పార్టీ రూ.50 కోట్లు ఆఫర్ చేసిందని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ.. ఒక్క గోవాలోనే కాదు.. ప్రతీ రాష్ట్రంలో ఆపరేషన్ కమల్ పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. డబ్బులతో ఎమ్మెల్యేలను కొంటున్నారని అన్నారు. కానీ, కర్నాటకలో మాత్రం అలా సాధ్యం కాదన్నారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత ఎంబీ పాటిల్ మాట్లాడుతూ.. బీజేపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరే చాన్స్ లేదన్నారు. బీజేపీ, జేడీఎస్ నేతలే కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరితే రూ. 40 నుంచి 50 కోట్లు ఇస్తామని ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా.. కర్నాటక బీజేపీ నేత సీటీ రవి గత నెలలో మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి గోవాలో ఎన్డీయే సర్కార్ బలం 30కి చేరుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరుతారని జోస్యం చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ.. తాజాగా కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ప్రస్తుతం గోవాలో ఎన్డీయేకు 25 సీట్లు ఉన్నాయి. యూపీఏకు 12 సీట్లు ఉన్నాయి.
By offering Rs 50 Crores for each MLA...they (BJP) are not believing in democracy. Not only in Goa, everywhere they do Operation Kamala. They will offer money, they will purchase MLAs: Siddaramaiah, Congress leader
"No, it's not possible in Karnataka," he says. pic.twitter.com/ssMHQiW9dT
— ANI (@ANI) July 11, 2022
ఇది కూడా చదవండి: భారతావనికి సెల్యూట్.. రోమాలు నిక్కబొడిచేలా నాలుగు సింహాల చిహ్నం