అదే జరిగితే భట్టి విక్రమార్కకి మైనస్‌గా అవుతుందా?

Bhatti Vikramarka Progress Report Khammam District - Sakshi

ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో మల్లు భట్టి విక్రమార్క పేరు తెలియనివారుండరు. ఖమ్మం జిల్లాలో మధిర నియోజకవర్గం నుంచి మూడు సార్లుగా ఆయన విజయం సాధిస్తున్నారు. నాలుగోసారి కూడా విజయం నాదే అంటున్నారాయన. సీఎల్పీ నేతగా రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నా భట్టి విక్రమార్క నియోజకవర్గంలో మంచి మార్కులు తెచ్చుకున్నారా?. మధిరలో ఆయన పని తీరు ఎలా ఉంది?. ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు?. ఆయన ప్రత్యర్థులు ఎవరు?. భట్టి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది?

మధిరలో ఢీ అంటే ఢీ
అటు కాంగ్రెస్, ఇటు సీపీఎంలకు కంచుకోటగా పేరు తెచ్చుకున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం రాజకీయాల మీద పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఎస్సీ రిజర్వుడు నుంచి జనరల్ సీటుగా మారిన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ వరుసగా కాంగ్రెస్ తరపున భట్టి విక్రమార్క విజయం సాధించారు.

కమలారాజ్‌ రెండు సార్లు సీపీఎం అభ్యర్థిగా, ఒకసారి గులాబీ పార్టీ అభ్యర్థిగా మధిర నుంచి పోటీ చేసి.. భట్టి విక్రమార్క చేతిలో మూడుసార్లు ఓటమి చెందారు. నాలుగోసారి పోటీ చేసి సత్తా చాటేందుకు భట్టి విక్రమార్క రెడీ అవుతుండగా.. ఆయన మీదే మూడు సార్లు ఓడిపోయిన కమల్‌రాజ్​కు నాలుగోసారి కూడా బీఆర్ఎస్ అవకాశం ఇస్తుందా లేదా చూడాలి. 2 లక్షల 9 వేల 945 మంది ఓటర్లున్న మధిరలో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 16 సార్లు ఎన్నికలు జరగ్గా.. ఇప్పటి వరకు 8 సార్లు కాంగ్రెస్, 6 సార్లు సీపీఎం విజయం సాధించాయి.

కమ్యూనిస్టులు వర్సెస్‌ కాంగ్రెస్
1985 నుంచి మధిరలో సీపీఎం పాగా వేయగా.. రిజర్వుడు సీటుగా మారిన తర్వాత మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురేస్తోంది. 2014లో రెండోసారి మల్లు భట్టి విక్రమార్క చేతిలో ఓటమి చెందిన కమల్‌ రాజ్‌.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయుడుగా ముద్రవేసుకున్న కమల్ రాజు ఆయనతో కలిసి అప్పటి ఆఖ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, వామపక్ష పార్టీలతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంది. పొత్తులో భాగంగా మూడవసారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసిన మల్లు భట్టివిక్రమార్క ఆఖ అభ్యర్థిగా బరిలో దిగిన కమల్ రాజుపై గెలుపొందారు.

వరుసగా మూడుసార్లు లింగాల కమల్ రాజ్ పై భట్టి విక్కమార్క విజయం సాధించారు. పరిస్తితులు తలక్రిందులు కావడంతో స్థానిక ఎన్నికల్లో గులాబీ పార్టీ తరఫున మధిర జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపోందారు లింగాల కమల్ రాజ్. తర్వాత ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పొంగులేటితో విభేదాలు రావడంతో ప్రస్తుతం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వర్గీయుడిగా కొనసాగుతున్నారు.

ఇక నియోజకవర్గంలో జడ్పీ చైర్మన్ హోదాలో కమల్ రాజ్ విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ పెద్దగా పట్టు సాధించలేకపోతున్నారనే టాక్ ఉంది. వరుసగా మూడసార్లు ఓటమి పాలుకావడంతో అసలు నాల్గవసారి టికెట్ వస్తుందా.. ఒకవేళ వస్తే భట్టి విక్రమార్కపై గెలిచేంత గ్రౌండ్ కనకరాజ్కు ఉందా అన్న సందేహాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.

భట్టి గట్టి పట్టు
2009 నుంచి వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించిన భట్టి విక్రమార్క ముదిగొండ నుంచి జమలాపురం వరకు బీటీ రోడ్లు వేశారు. జాలిముడి ప్రాజెక్టుకు నిధులు తీసుకొచ్చి పూర్తి చేశారు. మధిర మండలం మడుపల్లిలో లెదర్ పార్క్ కి ఇచ్చిన హామీ, మీనవోలు లో పరిశ్రమ ఏర్పాటుకు, బోనకల్లులో ఇందిర క్రాంతి మహిళా డైరీ కేంద్రం ఏర్పాటు, సాగర్ కాలువను థర్డ్ జోన్ నుంచి సెకండ్ జోన్ కి తీసుకొచ్చే హామీలు పెండింగ్ లో ఉండి పోయాయి.

వాటిని కూడ పూర్తయ్యేలా చూడాలని మధిర వాసులు ఎమ్మెల్యే విక్రమార్కను కోరుతున్నారు. చింతకాని మండలం కోమట్ల గూడెంలో మరియమ్మ లాకప్ డెత్ కేసును ఉద్యమంగా మలిచి రాష్ట్రస్థాయిలో మంచి మైలేజ్ తెచ్చుకున్నారు భట్టి విక్కమార్క. ఈ నేపథ్యంలోనే దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్టును చింతకాని మండలంలో అమలుచేస్తున్నట్లు సీఎం కెసిఆర్ ప్రకటించారు.

ఇదే విషయాన్ని పలు సమావేశాల్లో భట్టి విక్కమార్క చెప్పుకొచ్చారు. దళితబంధు పథకం భట్టికి కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. సీఎల్పీ నేతగా రాష్ట్రస్థాయిలో బిజీగా ఉండటం వల్ల నియోజకవర్గ మీద పెద్దగా దృష్టి పెట్టడంలేదనే లేదని విమర్శ సైతం భట్టి విక్రమార్క మీద ప్రభావం చూపే అవకాశం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కారు సీటు ఎవరికి?
ఈ సారి జరగబోయే ఎన్నికల్లో ఆఖ పార్టీ తరుపున ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఉద్యమకారుడైన బొమ్మెర రాంమూర్తి, కోట రాంబాబు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కమల్‌రాజ్‌ మూడు సార్లు ఓడిపోయిన అనుభవం ఉన్నందున ఈ సారి ఆయనకు అది ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా చూడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి మల్లు భట్టి విక్రమార్క పోటీ చేయడం ఖాయం. మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్, ఆఖ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు బలంగా ఉంది.
చదవండి: మంత్రి పువ్వాడకు ప్లస్ ఏంటీ? మైనస్ ఏంటీ?

బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గ విబేధాలు భట్టికి మరోసారి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిమానులు ఎక్కువగా ఉన్నారు. పొంగులేటి గులాబీ గూటి నుంచి కమలం గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన గనుక పార్టీ మారితే ఆ పార్టీ సైతం గట్టి అభ్యర్థిని పోటీలో పెట్టే అవకాశం ఉంటుంది. పొంగులేటి బీజేపీలోనే చేరితే గనుక మధిరలో త్రిముఖ పోటీ తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉన్నందున మల్లు ప్రత్యర్థుల ఓట్లన్నీ చీలిపోతే... నాలుగోసారి ఆయన విజయం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

మరోవైపు బీఆర్ఎస్, వామపక్షాల పొత్తు ఖాయమంటున్నారు గనుక.. అదే జరిగితే భట్టికి కొంత మైనస్‌గా మారే అవకాశాలూ కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సీపీఎంకు బలమైన నియోజకవర్గం గనుక ఇప్పటికీ ఆ పార్టీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉందంటున్నారు. అందువల్ల బీఆర్ఎస్, లెఫ్ట్ మధ్య పొత్తు కుదిరితే మల్లు కష్టపడాల్సి వస్తుంది. కాని ఎన్నికల నాటికి పొలిటికల్ ఈక్వేషన్స్ ఇంకా ఎన్ని రకాలుగా మారతాయో ఇప్పుడే చెప్పడం కష్టమే.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top