అమృత్‌ ఆలస్యం | - | Sakshi
Sakshi News home page

అమృత్‌ ఆలస్యం

Jun 16 2026 11:40 PM | Updated on Jun 16 2026 11:40 PM

పెద్దపల్లిరూరల్‌: పట్టణంలో అమృత్‌ 2.0 పనులు నత్తనడకన సా..గుతున్నాయి. ప్రజల దాహం తీర్చేందుకు రూ.25 కోట్ల అంచనాతో చేపట్టిన పనుల్లో డబుల్‌బెడ్రూమ్‌ ఇళ్లు ఉన్న(రాంపల్లి, చందపల్లి)ప్రాంతంలో ఐదేసి వేల లీటర్ల సామర్థ్యం గల సంప్‌లు నిర్మించారు. పలు వార్డుల్లో దాదాపు 25 కి.మీ. మేర పైప్‌లైన్‌ పనులు చేపట్టాల్సి ఉండగా.. ఇప్పటివరకు 15 కి.మీ. వరకు పూర్తయినట్టు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పట్టణాల్లో తాగునీటి వ్యవస్థను మెరుగుపర్చాలన్న ఆలోచనతో అమల్లోకి తెచ్చిన అమృత్‌ 2.0 పథక ఉద్దేశం అమలుకు నోచడం లేదు.

కూల్చారు సరే..కొత్తది కట్టేదెపుడో..!

స్థానిక ఆర్డీవో ఆఫీసులో 50 ఏళ్లక్రితం నిర్మించిన 8,18,280 లీటర్ల సామర్థ్యం గల పాతవాటర్‌ ట్యాంకు కూల్చిన అధికారులు.. అక్కడే 17.50 లక్షల లీటర్ల నిల్వ సామర్థ్యంతో మమరోట్యాంక్‌ నిర్మించాలని నిర్ణయించారు. పాతది కూల్చివేసి 8నెలలు గడిచినా కొత్తదాని పనులు ప్రారంభించనేలేదు. పాతది బలంగానే ఉందని, దానిని కూల్చి ప్రజాధనం వృథా చేశారని పట్టణవాసి ఎన్‌డీ తివారీ స్థానిక అధికారులు మొదలు సీఎంవో ఆఫీసు వరకూ ప్రతీఒక్కరికి ఫిర్యాదు చేశారు. అయినా, కొత్త ట్యాంకు పనులు కార్యరూపం దాల్చలేదు. దీంతో పాత ట్యాంకు నుంచి ఇంటింటికీ తాగునీటి సరఫరా నిలిచిపోయి పట్టణ ప్రజలకు ఇబ్బంది ఏర్పడింది. అధికారులు అప్రమత్తమై డైరెక్టు పంపింగ్‌ ద్వారా కొన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తు న్నా.. ఇంకా అక్కడక్కడా తాగునీరందక సమస్యలు ఎదుర్కొంటున్నామనే ఫిర్యాదులు వస్తున్నాయి.

లీకేజీలు.. భగీరథ వృథా

పలు ప్రాంతాల్లోని ప్రధాన పైపులు లీకవుతున్నాయి. దీనికితోడు ఇంటింటికీ తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన మిషన్‌భగీరథ పైపుల ద్వారా నీరంతా వృథాగా డ్రైనేజీల్లోకి చేరుతోంది. ఇటీవల ఏడో వార్డు సందర్శనలో మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య నీటివృథాను అరికట్టేందుకు నల్లాలకు డమ్మీ వేయాలని సిబ్బందిని ఆదేశించారు. నీరు అవసరం లేని ఇంటి యజమానులు దుబారాను అరికట్టాలని సూచిస్తున్నారు. ఇలా లీకేజీలను గుర్తించి మరమ్మతు చేయడం నిత్యకృత్యమైంది.

డిసెంబర్‌ వరకు పనులు పూర్తి

అమృత్‌ పథకం ద్వారా చేపట్టిన పనులు ప్రారంభించి ఈఏడాది డిసెంబర్‌ వరకు పూర్తిచేస్తాం. పట్టణంలో మరో 10 కి.మీ. పొడవైన పైప్‌లైన్‌తోపాటు చందపల్లి, పెద్దపల్లిలో వాటర్‌ ట్యాంకులు నిర్మించాల్సి ఉంది. చందపల్లిలో పనులు మొదలయ్యాయి. పెద్దపల్లిలోనూ ప్రారంభిస్తాం. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా మా సిబ్బందితో ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నాం.

– సతీశ్‌, ఏఈ, మున్సిపల్‌, పెద్దపల్లి

నత్తనడకన తాగునీటి పథకం పనులు

పాత ట్యాంకు కూల్చివేసి 8 నెలలు

ఇంకా ప్రారంభంకాని కొత్త ట్యాంక్‌ నిర్మాణం పనులు

కొన్ని ప్రాంతాల్లో తాగునీటికి అవస్థలు పడుతున్న జనం

జిల్లా కేంద్రంలో అమృత్‌ పథకం ద్వారా చేపట్టిన తాగునీటి పథకం పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతోంది.. ప్రజలకు తాగునీటిని మెరుగ్గా సరఫరా చేసేందుకు వీలుగా పనులు వేగంగా చేయాలి.. ఆర్డీవో ఆఫీసులో కొత్త ట్యాంకు పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తిచేయాలి.

– ఇటీవల జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అన్నమాటలివి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement