టార్గెట్‌ 65 మిలియన్‌ టన్నులు | - | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ 65 మిలియన్‌ టన్నులు

Apr 12 2026 2:36 AM | Updated on Apr 12 2026 2:36 AM

● వార్షిక లక్ష్యం ప్రకటించిన సింగరేణి ● గతేడాదికన్నా 7 మి.ట.ల తగ్గింపు ● నెలరోజుల ఆలస్యంగా టార్గెట్‌పై యాజమాన్యం నిర్ణయం

గోదావరిఖని: బొగ్గు ఉత్పత్తి లక్ష్యంపై సింగరేణి యాజమాన్యం వెనక్కి తగ్గింది. ఏటా ఉత్పత్తి పెంచుతూ వస్తున్న బొగ్గు గనుల సంస్థ.. 2026–27 ఆర్థిక సంవత్సరంలో 65 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించింది. గత ఆర్థిక సంవ త్సరంలో 72 మిలియన్‌ టన్నులు లక్ష్యంగా నిర్దేశించింది. కానీ, 60 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సాధించింది. బొగ్గు గ్రేడ్‌పై వినియోగదారులు ఆసక్తి చూపకపోవడంతో రెండు ఏరియాల్లో ఉత్పతి భారీగా తగ్గించింది. దీని ప్రభావం మొత్తం సింగరేణిపై పడినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ఆనవాయితీకి భిన్నంగా..

వాస్తవానికి ప్రతీ ఆర్థిక సంవత్సరంలో మార్చి 15వ తేదీ నాటికి వచ్చే ఆర్థిక ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ఖరారు చేయడం ఆనవాయితీ. ఈసారి ఇందుకు భిన్నంగా ఏప్పిల్‌ 10వ తేదీ తర్వాత టార్గెట్‌ ప్రకటించడం గమనార్హం. అయితే, గత లోటును పూడ్చడంతోపాటు కచ్చిమైన లక్ష్యంతో ముందుకు సాగాలనే ఆలోచనతో సింగరేణి ఈసారి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొత్తగూడెం, మణుగూరులో తగ్గిన టార్గెట్‌

సింగరేణి వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని 12 ఏరియాల వారీగా కేటాయించింది. గతేడాదితో పోల్చి తే కొత్తగూడెం, మణుగూరులో ఉత్పత్తి బాగా తగ్గించింది. కొత్తగూడెంలో 156.50లక్షల టన్నులు కేటాయించగా ఈసారి 22.50లక్షల టన్నులకే పరిమితం చేసింది. మణుగూరులో గతేడాది 114.90లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలనేది లక్ష్యంగా నిర్దేశించగా.. ఈసారి 96.26లక్షల టన్నులకు కుదించారు. జీ–14, 15 గ్రేడ్‌ రకం బొగ్గు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు అంతగా ఆసక్తి చూపకపోవడంతో సింగరేణి యాజమాన్యం ఈనిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

నెల ఆలస్యంగా వార్షిక లక్ష్యం

2026–27 ఆర్థిక సంవత్సరంలో నెల ఆలస్యంగా సింగరేణి వార్షిక లక్ష్యం ఖరారు చేసింది. వాస్తవానికి ఏటా మార్చి మధ్యలోనే వార్షిక లక్ష్యం ప్రకటించడం ఆనవాయితీ. టార్గెట్‌ కమిటీలు ఏరియాల వారీగా పర్యటించి వార్షిక లక్ష్యాన్ని ఖరారు చే స్తాయి. ఈ బృందాల పర్యటన ఈసారి సకాలంలో పూర్తయినా.. యాజమాన్యం జాప్యం చేసింది.

కలగా వంద మిలియన్‌ టన్నులు?

భవిష్యత్‌లో వంద మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తామని సింగరేణి యాజమాన్యం గతంలో అనేకసార్లు ప్రకటించింది. కొత్తగనులు ప్రారంభించి వార్షిక లక్ష్యం పెంచుకుంటూ పోతామని చెప్పింది. కానీ, ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేవిత లక్ష్యం చూస్తే సంస్థ తిరోగమన దిశలో ముందుకు సాగుతోందని అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement