పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో అపరిచితులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందివ్వాలని ఏసీపీ కృష్ణ కోరారు. పట్టణంలోని సాగర్ రోడ్డు(మినీ ట్యాంకు బండ్ ఏరియా)లో శనివారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఏసీపీతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్ సీఐలు ప్రవీణ్‌కుమార్, సుబ్బారావు, పోలీసు సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఆధారాల్లేని 70 బైక్‌లు, నాలుగు ఆటోలు, ఒక ట్రాలీ, సమీపంలోని బెల్ట్ దుకాణాల్లో మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిని ఉపేక్షించబోమని ఏసీపీ హెచ్చరించారు. పొరుగు రాష్ట్రాలనుంచి వచ్చి కిరాయికి ఉండే వారిగుర్తింపు వివరాలను ఇంటి యజమానులు తీసుకోవాలని ఆయన సూచించారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు వాహనదారులు రోడ్‌సేఫ్టీ నిబంధనలను పాటించాలని ఏసీపీ అన్నారు.


