● నిందితుడి అరెస్టు : ఎస్పీ
పార్వతీపురం రూరల్: అప్పుల బాధ నుంచి గట్టెక్కేందుకు ఓ వ్యక్తి తన బంధువైన వృద్ధురాలిని హతమార్చిన ఘటనలో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. మక్కువ మండలం మేలపువలస గ్రామానికి చెందిన మేలపు సింహాచలం (67) ఈ నెల 20న తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తొలుత దీనిని అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన పోలీసులు, పోస్టుమార్టం నివేదికలో ఆమెను గొంతు నులిమి చంపినట్లు తేలడంతో కేసును హత్యగా మార్చి దర్యాప్తు చేపట్టారు. అదే గ్రామానికి చెందిన చోంగలి ఈశ్వరరావు జూదం, మద్యం వ్యసనాలకు బానిస కావడంతో పాటు సుమారు రూ.1.50 లక్షల అప్పుల్లో ఉన్నాడు. ఒంటరిగా ఉంటున్న మృతురాలు సింహాచలం వద్ద ఉన్న బంగారు ఆభరణాలపై కన్నేసిన నిందితుడు, ఈ నెల 20న రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో తలదాచుకుంటాననే నెపంతో ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం ఆమైపె దాడి చేసి, ముక్కు, మెడపై నొక్కి ఊపిరి ఆడకుండా చేసి ప్రాణాలు తీశాడు. బయట అలికిడి కావడంతో భయపడి కేవలం బంగారు గొలుసును మాత్రమే తీసుకుని పారిపోయాడు. శనివారం మధ్యాహ్నం నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతని నుంచి 11.700 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై సెక్షన్ 305(ఎ) బీఎన్‌ఎస్ కింద అదనపు అభియోగాలు నమోదు చేశారు. సమావేశంలో ఏఎస్పీ మనీషా రెడ్డి, సాలూరు సీఐ పి.రామకృష్ణ, మక్కువ ఎస్‌ఐ వెంకటరమణ పాల్గొన్నారు.


