పార్వతీపురం రూరల్: ఉత్తరాంధ్రలో ఆధ్యాత్మిక చైతన్యం, సామాజిక ఐక్యతే లక్ష్యంగా ‘శ్రీరామ గ్రామ జాగృతి యాత్ర’ శుక్రవారం ప్రారంభమైంది. పార్వతీపురం జిల్లా కేంద్రంలోని శ్రీ విద్యా సర్వమంగళ దేవి పీఠంలో శ్రీరామనవమి వేడుకల అనంతరం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర దంపతులు యాత్ర ప్రచార రథాన్ని ప్రారంభించి, లోగోను ముఖ్య అతిథులు యిండుపూరు గున్నేశ్వరరావు, బెలగాం జయప్రకాష్ నారాయణ తదితరులతో కలసి కాళిదాసు శర్మ యాజీ నేతృత్వంలో ఆవిష్కరించారు. ఈ ఉద్యమంలో భాగంగా ‘రామ స్థూప నిర్మాణ మహాసంకల్పాన్ని’ చేపట్టినట్టు ఆధ్యాత్మిక మార్గదర్శకులు కాళిదాసు శర్మ యాజి తెలిపారు. ‘ఒక గ్రామం – ఒక రాయి’ నినాదంతో రాష్ట్రంలోని వివిధ గ్రామాల నుంచి భక్తుల భాగస్వామ్యంతో శిలలను సేకరించి రామ స్థూపాన్ని నిర్మించనున్నట్టు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ధర్మ ప్రచారం, యువతలో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ప్రజల్లో చైతన్యం నింపాలని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర ఆకాంక్షించారు. ఈ యాత్రను తొలుత మన్యం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో నిర్వహించి, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర మాట్లాడుతూ కేవలం సాంప్రదాయాలకు విలువనిస్తూ లోక కల్యానార్ధం రాజకీయాలకు అతీతంగా చేపట్టిన ఈ కార్యక్రమం శ్రీరాముని భక్తుల్లో మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపాలని ఆకాంక్షించారు. ఇప్పటికే తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని తెలుసుకున్నారని.. ఆయన కూడా కార్యక్రమంలో తన వంతు భాగస్వాములు అవుతారని తెలిపారు. మరికొద్ది రోజుల్లో జగన్‌మోహన్‌రెడ్డిని కలసి పూర్తి వివరాలను కాళిదాసు శర్మతో కలసి వివరిస్తున్నట్టు రాజన్నదొర తెలిపారు.
రామ రాజ్య గ్రామోద్యమానికి అంకురార్పణ
‘ఒక గ్రామం – ఒక రాయి’ సంకల్పంతో రామ స్థూప నిర్మాణం
మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర, కాళిదాసు శర్మ


