● ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి అశోక్
కురుపాం: ఆదివాసీ గిరిజన నాయకులు, ప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ తక్షణమే తన పదవికి రాజీనామా చేసి గిరిజనులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ.అశోక్ డిమాండ్ చేశారు. టెకరకండి గ్రామం వద్ద మన్యం జిల్లా ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. నిరసనలో పాల్గొన్న వారు ఎమ్మెల్యే అశోక్ వ్యాఖ్యలను ఖండిస్తూ నినదించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని వినతిపత్రం ఇవ్వడానికి ఆదివాసీ గిరిజన జేఏసీ ప్రతినిధులు ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లిన సందర్భంగా వారిపై ఎమ్మెల్యే అసభ్య పదజాలంలో మండిపడ్డారని ఇది సరికాదన్నారు. ప్రజల సమస్యలు వినాల్సిన ఎమ్మెల్యే అందుకు విరుద్ధంగా వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఆయన వ్యాఖ్యలు గిరిజన సమాజాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తన పదవిలో కొనసాగే హక్కు కోల్పోయారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అశోక్ వెంటనే రాజీనామా చేసి గిరిజన నాయకులు, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై భవిష్యత్‌లో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. నిరసనలో గిరిజన, ప్రజా సంఘాల నాయకులు ఎస్.అప్పారావు, లక్ష్మణరావు, సన్యాసిరావు, ఎం.రమణ, సీతారాం, మండంగి శ్రీను, కె.గంగునాయుడు, ఎన్‌వై నాయుడు, ఇందిర, పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.


