రోడ్ల నిర్మాణంపై.. మక్కువ చూపేదెన్నడు?
సాలూరు రూరల్: జిల్లాలోని ఏజెన్సీ రోడ్లు అధ్వానంగా మారాయి. రాకపోకలకు గిరిజనం ఇబ్బంది పడుతున్నారు. పల్లెపండగ పేరుతో రోడ్లను అద్దంలా తీర్చిదిద్దుతామని చెప్పిన చంద్రబాబు సర్కారు మళ్లీ పండగ వస్తున్నా రోడ్ల నిర్మాణంపై కనీసం దృష్టిసారించలేదు. ‘ఏ రోడ్డు చూసినా ఏముంది గర్వకారణం.. అన్నీ రాళ్లమయం’ అన్న చందంగా మారాయి. సీ్త్రశిశుసంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో పలు గ్రామాల రోడ్లు గోతులతో దర్శనమిస్తున్నాయి. గత ప్రభుత్వంలో మంజూరైన రోడ్ల పనులు కూడా నిలిచిపోయాయి. గత ప్రభుత్వంలో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర కృషితో సాలూరు నుంచి మక్కువకు 19 కిలోమీటర్ల మేర రోడ్డు, 9 వంతెనలు నిర్మాణ పనులకు రూ.55 కోట్లు మంజూరయ్యాయి. రోడ్లు భవనాల శాఖ అధికారులు వంతెన పనులు ప్రారంభించి మూడు వంతెన నిర్మాణాలు పూర్తిచేశారు. ఎన్నికలు రావడం, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
నిర్మిస్తామన్నారు.. వదిలేశారు..
మంత్రి సంధ్యారాణి ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మక్కువ రోడ్డు నిర్మాణం పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. 18 నెలలు గడిచినా రోడ్డు పనులు ప్రారంభించలేదు. దీంతో ఉన్న నిధులు వెనక్కి మళ్లిపోయాయి. రోడ్లు పనులకు రూ.55 కోట్లు అవసరం కాగా ప్రస్తుతం రూ.10 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. పనులు 6 నెలలుగా టెండరు దశలోనే ఉన్నాయి. చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్లే పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిలిచిన బస్సు సర్వీసు
మక్కువ రోడ్డంతా గుంతల మయం కావడంతో ఆర్టీసీ యాజమాన్యం సాలూరు–మక్కువ రోడ్డులో సర్వీసును నిలిపివేసింది. ఆరు నెలలుగా ఈ ప్రాంతీయులకు బస్సు సర్వీసు దూరమైంది. ప్రయాణానికి నానా అవస్థలు పడాల్సి వస్తోంది. బాగువలస గ్రామం మీదుగా ప్రయాణించాల్సిన బస్సు ఇప్పుడు మామిడిపల్లి, శంబర గ్రామాల మీదుగా నడుపుతున్నారు. మంత్రి స్పందించి తక్షణమే రోడ్డు నిర్మాణానికి చొరవ చూపాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.
అధ్వానంగా మక్కువ రోడ్డు
గత ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణానికి రూ.55 కోట్ల కేటాయింపు
చంద్రబాబు ప్రభుత్వంలో రూ.10 కోట్లకు కుదింపు
6 నెలలుగా టెండర్ దశకే పరిమితం
రాకపోకలకు ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
రోడ్ల నిర్మాణంపై.. మక్కువ చూపేదెన్నడు?


