మీరు చెప్పిందేనా.. నేను చెప్పింది వినరా!
పార్వతీపురం మండలం జమదల గ్రామంలో సుమారు 600 మంది రైతులు ధాన్యం పండించారు. దాదాపు పది రోజులుగా నూర్పిడిచేసిన సుమారు 60 లారీల లోడ్ల ధాన్యంను విక్రయానికి సిద్ధం చేశారు. ఇప్పటికీ ప్రభుత్వపరంగా కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. మిల్లర్లంతా సిండికేట్‌గా మారి.. జమదాల ధాన్యమంటే తీసుకోవద్దని ఒక మాట మీదకు వచ్చారు. 40 కిలోల బస్తా దగ్గర అదనంగా మూడు కిలోలు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. బంగారంలా ఉన్న ధాన్యాన్ని అదనంగా ఎందుకు ఇవ్వాలని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఎక్కడ అమ్ముకుంటారో చూస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇదే విషయమై సంయుక్త కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డిని కలిసి రైతులంతా వివరించారు. ఆయన సమాధానం.. ‘గతేడాది మీ దగ్గర ధాన్యానికి సంబంధించి ఫిబ్రవరి వరకు ట్రక్‌షీట్లు ఉన్నాయి. ఇప్పుడెందుకు తొందర!’ అని బదులిచ్చారు. రైతులు ఏదో చెప్పబోతుండగా.. ‘మీరు చెప్పిందేనా.. నేను చెప్పింది వినరా?’ అంటూ ఎదురుప్రశ్నించారు.


