పుస్తెల తాడు లాక్కెళ్లిన చైన్‌స్నాచర్లు
రాజాంసిటీ: రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన గంగు భాగ్యలక్ష్మి భర్త సురేష్‌తో కలిసి గురువారం కిరాణా సామగ్రి కొనుగోలు నిమిత్తం రాజాం వస్తుండగా గాయత్రి కాలనీ సమీపంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఆమె మెడలోని రెండు తులాల పుస్తెలతాడును తెంచి పారిపోయారు. దీంతో భాగ్యలక్ష్మి బండిపై నుంచి కింద పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తికి గాయాలు
పార్వతీపురం రూరల్: పట్టణంలో భవన నిర్మాణ కార్మికుడు సెంట్రింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై గాయాల పాలయ్యాడు. అవుట్ పోస్ట్ పోలీసులు తెలిపిన వివరాలు.. బెలగాం చెరువు వీధిలో ఓ ఇంటి నిర్మాణానికి సంబంధించి పై కప్పు సెంట్రింగ్ పనులు చేస్తున్న బి.మణికంఠ అనే భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా తీగలను తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అతడిని పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు వివరాలు సేకరించినట్టు అవుట్‌పోస్ట్ పోలీసులు తెలిపారు.


