మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు
● అధికారులతో కలెక్టర్
డా.ఎన్.ప్రభాకరరెడ్డి
పార్వతీపురం రూరల్: జ్వరాల సీజన్ దృష్ట్యా జిల్లాలోని మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని మలేరియా నివారణకు నవంబర్ నుంచి జనవరి వరకు ప్రైడే–డ్రైడే కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి ఎంపీడీఓలను ఆదేశించారు. జిల్లాలో డోలీమోతలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే తక్షణ కర్తవ్యమని, ప్రతిరోడ్డులో అంబులెన్స్ వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు రోడ్లు, సర్వే, అనుమతులు నెలరోజుల్లోగా పూర్తి కావాలని, ఆ పనుల బాధ్యత ఎంపీడీఓలదేనని స్పష్టం చేశారు. గురువారం ఆయన అన్ని శాఖల అధికారులతో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మండలాల్లోని పర్యాటక ప్రాంతాలను గుర్తించి స్థానిక గిరిజనులతో కలిసి అభివృద్ధి చేసి వారికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ భూమి, శ్మశాన వాటికల చుట్టూ చింత, నేరేడు వంటి ఆదాయాన్ని ఇచ్చే పండ్ల మొక్కలను పెంచడం ద్వారా పంచాయతీలకు అదనపు ఆదాయాలు సమకూరుతాయన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో సర్పంచ్‌లను బాధ్యులను చేసి ప్రతినెల సమావేశాలు నిర్వహించాలని, అలాగే ఈ–పంట నమోదు ప్రక్రియ ఈనెల 25 నాటికి 100శాతం పూర్తి కావాలని, ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా దృష్టిసారించాలని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ ఎం. సుధారాణి, డీఎంహెచ్‌ఓ డా.ఎస్.భాస్కరరావుతో పాటు జిల్లా అధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.


