● వైద్యాధికారులకు మంత్రి సంధ్యారాణి ఆదేశాలు
పార్వతీపురం రూరల్: జిల్లాలో జ్వరాలు ప్రబలకుండా వైద్యులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వైద్యాధికారులను ఆదేశించారు. వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ పిల్లలు ఆస్పత్రికి వెళ్లే ముందే తగిన చర్యలు చేపట్టాలన్నారు. అలాగే వసతి గృహ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు వారానికి ఒకసారి కాకుండా రెండుసార్లు చేయాలని, 199 గురుకులాలు, 750 ఆశ్రమ పాఠశాలలకు ఏఎన్‌ఎంలు వెళ్లి పరీక్షించాలని, పీహెచ్‌సీ వైద్యులు తప్పకుండా ప్రతి వసతిగృహాన్ని సందర్శించి, మందులు అందుబాటులో ఉంచాలని, వసతి గృహాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని, మౌలిక వసతులు, తాగునీరు (ఆర్‌ఓ ప్లాంట్ మరమ్మతులు) పక్కాగా ఉండాలని మంత్రి ఆదేశించారు.
జేసీకి మంత్రి సత్కారం
అనంతరం రాష్ట్రంలో ఉత్తమ ఐటీడీఏగా ఎంపికై న పార్వతీపురం తరఫున జేసీ, ఇన్‌చార్జి పీఓ యశ్వంత్ కుమార్ రెడ్డిని మంత్రి ఈ సందర్భంగా సత్కరించారు. అభివృద్ధి కార్యక్రమాలు, ఆదికర్మయోగి అమలు తీరును కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్ది మంత్రికి వివరించారు. సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.


