శ్మశానాల రోడ్ల కోసం ఉపాధి నిధులతో ప్రతిపాదన
● విజిలెన్స్ అండ్ మానిటరింగ్
సమావేశంలో కలెక్టర్
విజయనగరం అర్బన్: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కాలనీలకు, శ్మశానాలకు రహదారుల సౌకర్యం కల్పించేందుకు ఉపాధి హామీ నిధులతో ప్రతిపాదనలు రూపొందించి ప్రణాళికలో పెట్టాలని డ్వామా అధికారులకు కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హౌస్ హోల్డ్ సర్వేలో ఎస్సీ కులాల వారిని బీసీకులాల వారిగా నమోదు చేయడంతో వారికి అందవలసిన లబ్ధి అందకుండా పోతోందని సభ్యుడు బసవ సూర్యనారాయణ కలెక్టర్‌కు విన్నవించుగా ఎడిట్ ఆప్షన్ కోసం ప్రభుత్వానికి లేఖ రాస్తామని, ఆప్షన్ మార్చడం జరుగుతుందని తెలిపారు. సంక్షేమ వసతిగృహాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యం, రక్షిత తాగునీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని డైలీ పర్యవేక్షణ ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో నమోదైన 35 అట్రాసిటి కేసులకు గాను రూ.42 లక్షల 79 వేలు పరిహారంగా చెల్లించినట్లు కలెక్టర్ తెలపగా పరిహారం త్వరగా అందించినందుకు సభ్యులు జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. ప్రతినెలా పౌర హక్కుల దినం గ్రామాల మధ్యలో జరగాలని, ఇందులో పోలీసు, రెవెన్యూ అధికారులు పాల్గొని ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంపై అవగాహన కలిగించాలని కలెక్టర్ సూచించారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జిల్లాలో 20 కేసులు నమోదైనట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ రఘురాజు, డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తి, సోషల్ వెల్ఫేర్ డీడీ వెంకటేశ్వరరావు, ఆర్‌డీఓలు, డీఎస్పీలు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.


