కార్తీకమాస పూజలకు వేళాయె..
నెల్లిమర్ల రూరల్: భక్తులు పరమపవిత్రంగా భావించే కార్తీకమాసం రానే వచ్చేసింది. బుధవారం నుంచి నెల రోజుల పాటు అంతటా ఆధ్యాత్మిక శోభ సాక్షాత్కరించనుంది. దీంతో మండల వ్యాప్తంగా ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలు పూజలకు సిద్ధమయ్యాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీసీతారామస్వామి దేవస్థానంలో ప్రత్యేక క్యూలైన్లను దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ క్షేత్ర పాలకుడిగా విరాజిల్లుతున్న ఉమాసదాశివ ఆలయం కార్తీకమాస పూజలకు ముస్తాబైంది. సుదీర్ఘ చరిత్ర కలిగిన పారసాం శివాలయం, వెయ్యేళ్ల నాటి సారిపల్లి దిబ్బేశ్వరస్వామి ఆలయం, జోగిరాజుపేట శివాలయం సహా బూరాడపేట, సతివాడ, ఒమ్మి, సారిపల్లి తదితర గ్రామాల్లోని శివ మందిరాలను కార్తీకమాస పూజలకు అందంగా ముస్తాబు చేశారు. భక్తుల దైవదర్శనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బందోబస్తు, పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎస్‌ఐ గణేష్ తెలిపారు.


