
285 బస్తాల నకిలీ ఎరువులు సీజ్
మక్కువ: ఎరువుల కొరతను సొమ్ముచేసుకునేందుకు కొంతమంది అక్రమార్కులు రంగంలోకి దిగారు. అదునుచూసి రైతులకు నకిలీ ఎరువులను అంటగట్టి నిలువునా ముంచేస్తున్నారు. వందల కొద్దీ నకిలీ ఎరువుల బస్తాలు తీసుకొచ్చి విక్రయిస్తున్న విషయం వ్యవసాయాధికారుల దాడితో వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. మక్కువ మండలం సన్యాసిరాజపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న పంచాయతీ భవనంలో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ ఎరువులు నిల్వచేశారు. బుధవారం సాయంత్రం మార్క్‌ఫెడ్ డీఎం విమల సన్యాసిరాజపురం గ్రామం మీదుగా వెళ్తున్నారు. భవనం వద్ద ఆటోలో ఎరువులు ఎక్కిస్తున్న విషయాన్ని గుర్తించి వెంటనే మక్కువ మండలం పనసభద్ర పంచాయతీలో ఎరువుల దుకానాన్ని పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్‌కు ఆమె సమాచారం అందించారు. వెంటనే ఆయన భవనందగ్గరకు చేరుకున్నారు. విషయాన్ని గుర్తించిన అక్రమార్కులు భవనానికి తాళంవేసి పరారయ్యారు. మండల రెవెన్యూ, పంచాయతీ, పోలీస్ సిబ్బంది సమక్షంలో తాళం పగలగొట్టి చూడగా, ఎటువంటి స్టిక్కర్లులేని 285 తెల్లని బస్తాలలో ఎరువులు ఉన్నట్లు గుర్తించారు. భవనాన్ని, ఎరువులను సీజ్‌చేశారు. ఎరువులను శాంపిల్స్‌కు పంపించారు.