
ఇంటర్ విద్యార్థి మృతి
బొబ్బిలి: బాడంగి మండలం హరిజన పాల్తేరుకు చెందిన అలమండ ఉదయ రాజ్(16) అనే ఇంటర్ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో ఆదివారం దుర్మరణం చెందాడు. బాడంగి మండలానికి చెందిన అలమండ రవి బైక్ మెకానిక్ షాపు నిర్వహిస్తూ బొబ్బిలిలోనే స్థిరపడ్డాడు. రవికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఉదయరాజ్ విశాఖలోని శశి కాలేజ్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చిన ఉదయరాజ్ పాత బొబ్బిలిలోని తన స్నేహితుడిని కలిసి వస్తానని చెప్పి బైక్‌పై వెళ్లాడు. స్నేహితుడితో మాట్లాడి తిరిగి రాతిపనివారి వీధిలోని తన ఇంటికి వస్తుండగా పాత బొబ్బిలిలో ఉన్న గుంతల వద్ద అదుపు తప్పి కిందపడిపోవడంతో లారీ ఢీకొంది. దీంతో ఉదయ రాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తమ్ముడు ప్రేమ్‌కుమార్ 8వ తరగతి చదువుతున్నాడు. తల్లి ఉష భర్తకు చేదోడు వాదోడుగా షాపు దగ్గర ఉంటోంది. ప్రమాద సమాచారం అందుకున్న ఎస్సై పి జ్ఙానప్రసాద్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని సీహెచ్‌సీకి తరలించారు.