
సమన్వయలోపం ఉంది.. సరిదిద్దుకుంటున్నాం!
● అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి ● జంఝావతి, కొఠియా అంతర్రాష్ట్ర వివాదాలను త్వరలో పరిష్కరిస్తాం ● జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కొంత సమచారలోపం వల్లే ఇది ఏర్పడిందని.. దీనిపై బహిరంగంగానే చర్చించామని, సరిదిద్దుతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల అమల్లో జిల్లా మంత్రి, పజాప్రతినిధులకు ముందస్తు సమాచారాన్ని చేరవేస్తూ సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ ప్రారంభోత్సవ కార్యక్రమం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ అంశాలపై సమీక్షించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్వతీపురం మన్యం జిల్లా మారుమూల గిరిజన ప్రాంతం అయినప్పటికీ జీడీపీలో 16.94 శాతం వృద్ధి సాధించి రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు కూడా పని చేయాలని సూచించారు. వరితో పాటు ఉద్యానవన పంటలను ప్రోత్సహించేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ప్రతి రైతూ సభ్యునిగా చేరాలని, తద్వారా వ్యవసాయ రుణాలను పొందవచ్చని మంత్రి హితవు పలికారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు జిల్లా అనుకూలంగా ఉన్నందున పారిశ్రామిక వేత్తలతో మాట్లాడి యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే జీడి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటైందని.. దాంతో పాటు జీడి, మామిడి, పైనాపిల్ వంటి ఇతర యూనిట్ల స్థాపనకు ఆలోచన చేయాలని తెలిపారు. సాగు నీటి వినియోగం కోసం అవసరమైన లష్కర్లను రానున్న నాలుగు మాసాల్లోగా వేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. జంఝావతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల అంతర్రాష్ట్ర వివాదాలను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. కుంకీ ఏనుగుల మొదటి ఆపరేషన్ జిల్లాలోనే చేపట్టేలా కోరామని చెప్పారు. పీపీపీ విధానంలోనే వైద్య కళాశాల చేపడతామని స్పష్టం చేశారు. సమాచార శాఖ ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే విజయ్‌చంద్రలతో కలసి పరిశీలించారు. వ్యవసాయ శాఖ ఏర్పాటుచేసిన స్టాల్‌ను సందర్శించి రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం పార్వతీపురం మార్కెట్ యార్డులో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన జీడి ప్రాసెసింగ్ యూనిట్‌ను తనిఖీ చేశారు.
కూటమిలో విభేదాలు.. బీజేపీ, జనసేన డుమ్మా!
‘సుపరిపాలనలో తొలి అడుగు’.. అంటూ రాష్ట్రంలో మొదటి సమావేశం పార్వతీపురం మన్యం జిల్లాలో నే చేపట్టారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో కూటమిలోని విభేదాలు బయటపడ్డాయి. కార్యక్రమానికి టీడీపీ మినహా.. కూటమిలోని జనసేన, బీజేపీ నాయకులు హాజరు కాలేదు. ఏ ఒక్కరికీ ఆహ్వానం అందలేనట్లు తెలుస్తోంది. పాలకొండ జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ కూడా గైర్హాజరయ్యా రు. ఆయన స్థానికంగా లేరని సమాచారం. తమకు ఆహ్వానం అందకపోవడంపై రెండు పార్టీల నాయకులూ గుర్రుగా ఉన్నారు. తమను పట్టించుకోవడం లేదని ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎదుట కూటమి భాగస్వామ్యంలోని బీజేపీ నాయకులు మొరపెట్టుకున్నారు. తాను అంతా సరిదిద్దుతానని అప్పట్లో మంత్రి వారికి హామీ ఇచ్చారు. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మరలా ఫిర్యాదు చేసేందుకు వారు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.