
అత్యవసర రక్షణపై మాక్‌డ్రిల్
పార్వతీపురం టౌన్: అత్యవసర పరిస్థితు ల్లో పౌరుల సురక్షిత సంసిద్ధతకు వీలుగా బుధవారం ఉదయం 9 గంటలకు పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మాక్‌డ్రిల్ నిర్వహించనున్నట్టు జేసీ ఎస్‌ఎస్ శోభిక తెలిపారు. మాక్ డ్రిల్ సన్నాహక చర్యలపై కలెక్ట్‌ర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. పోలీసులు, ఫైర్, వైద్య విభాగాలు సంయుక్తంగా నిర్వహించే మాక్‌డ్రిల్‌కు ప్రజలు సహకరించాలని కోరారు. జిల్లా ముఖ్య అగ్ని మాపక అధికారి కె.శ్రీనుబాబు మాట్లాడుతూ అణుబాంబు విస్పోటన జరిగితే మూడు నుంచి 5 కిలోమీటర్ల మేర తీవ్ర ప్రభావం ఉంటుందని, దట్టమైన గోడలతో ఉండే ఇళ్లలో ఉండడం వల్ల రేడియేషన్ ప్రభా వం నుంచి సురక్షితంగా బయటపడవచ్చన్నారు. యుద్ధ సమయాల్లో లైట్లు పూర్తిగా ఆపివేయాలన్నారు. 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం సైరన్ మోగితే పరిస్థితిలో తీవ్రత ఉందని గ్రహించాలని, అందుకు తగిన విధంగా సురక్షిత చర్యలకు అధికార యంత్రాంగానికి సహకరించాలన్నారు. సమావేశంలో డీఆర్వో కె.హేమలత, కేఆర్‌సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు కోడా చలపతిరావు, ఒ.ప్రభాకరరావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.టి.జగన్‌మోహన్‌రావు, పౌర సరఫరాల సంస్థ జిల్లామేనేజర్ ఐ.రాజేశ్వరి, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎం.శికుమార్, డీఎస్పీ థామస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇసుక సరఫరాకు
రీచ్‌లు సిద్ధం
పార్వతీపురం టౌన్: జిల్లాలోని భామిని మండలం నేరడి, పాలకొండ మండలం చినమంగళాపురం ఇసుక రీచ్‌ల నుంచి ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సంబంధిత అధికారులను వీడియో కాన్ఫరెన్స్ లో మంగళవారం ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వులు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఇసుక సరఫరా కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు, బారికేడ్లు, చెక్‌పోస్టు, ఆన్‌లైన్ వే బిల్లు, రికార్డులన్నీ పక్కాగా ఉండాలన్నారు. సమావేశంలో జేసీ ఎస్.ఎస్.శోభిక, పాలకొండ సబ్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, జిల్లా గనులు, భూగర్భ వనరుల శాఖాధికారి జి.జయప్రసాద్, పోలీస్, భామిని, పాలకొండ తహసీల్దార్లు పాల్గొన్నారు.
బిత్రపాడులో ఏనుగుల గుంపు
జియ్యమ్మవలస: మండలంలోని నిమ్మలపాడు, బిత్రపాడు పంట పొలాల్లో మంగళవారం సాయంత్రం ఏనుగులు దర్శనమిచ్చాయి. నిమ్మలపాడు దగ్గర నాగావళి నదిలో ఉన్న ఏనుగులు సాయంత్రానికి బిత్రపాడు పొలిమేరలోకి చొచ్చుకురావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. పామాయిల్ తోటలో ఉంటూ అరటి పంట ధ్వంసం చేయడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికై నా వాటిని తరలించే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.