
పర్యాటకాభివృద్ధి పనులు పూర్తిచేయండి
పార్వతీపురంటౌన్: జిల్లాలోని తోటపల్లి, ఏనుగుకొండ, పెద్దగెడ్డ, వీరఘట్టం, కూర్మసాగరం ప్రాంతాలు బోటింగ్‌కు అనుకూలమని, వాటి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. తన చాంబర్‌లో అటవీ, పర్యాటక శాఖ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదు ప్రాంతాల్లో స్పీడ్ బోటింగ్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఒక్కో ప్రాంతంలో ఆరు నుంచి పది మంది ఆసక్తి కలిగిన గిరిజన యువతకు స్పీడ్ బోటింగ్‌పై శిక్షణ ఇప్పిస్తామని, యువతను ఎంపికచేయాలన్నారు. బోటింగ్ నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు నిర్వహించుకునే అవకాశం ఉందన్నారు. సీతంపేట మండలం పనుకుపేటలో గిరి గ్రామదర్శిని పనులు వీలైనంత త్వరగా ప్రారంభం కావాలన్నారు. గ్రామదర్శినిలో గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా మట్టితో నిర్మించిన గృహాలు, ప్రవేశ ద్వారం, గిరిజనులు వినియోగించే సామగ్రి, థింసా నృత్యం, గిరిజన వస్తువుల విక్రయ దుకాణాలు, కల్యాణమండపం వంటి ఏర్పాట్లు ఉండాలన్నారు. జగతిపల్లి రీసార్ట్స్ ప్రాంత అభివృద్ధికి ఆలోచన చేయాలని సూచించారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా పర్యాటక అధికారి ఎన్.నారాయణరావు, జిల్లా అటవీ శాఖాధికారి జీఏపీ ప్రసూన, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎల్.రమేష్, జిల్లా దేవదాయశాఖ అధికారి ఎస్.రాజారావు, తదితరులు పాల్గొన్నారు.
రక్త నిల్వలు పెంచాలి
రక్తహీనత నివారణతో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తాన్ని తక్షణమే అందించేందుకు వీలుగా రక్త నిల్వలు పెంచాలని వైద్యాధికారులను కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. జిల్లా ఆస్పత్రిని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలో జనరల్ వార్డు, బ్లడ్‌బ్యాంక్, సదరం, కంటి తనిఖీ కేంద్రం, ఓపీతో పాటు ప్రతీ విభాగాన్ని ఆయన పరిశీలించారు. అత్యవసర కేసుల వివరా లు ఏ అంశంపై వస్తున్నాయని ఆరా తీశారు. వైద్యసిబ్బంది సమయపాలన పాటించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. రోగులకు అందిస్తున్న భోజన వంటకాలను పరిశీలించి మరింత శుచి, రుచిగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ నాగ శివజ్యోతి, ఆస్పత్రి వైద్యులు డాక్టర్ బి.వాగ్దేవి, ఏపీఎంఐడీసీ ఇంజినీరింగ్ అధికారి బి.ప్రసన్నకుమార్, వివిధ విభా గాల వైద్యులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్