
పీజీఆర్‌ఎస్‌కు 136 అర్జీలు
విజయనగరం క్రైమ్: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 136 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా అర్జీదారులు పూర్తిగా సంతృప్తి చెందే విధంగా వినతులను పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అర్జీలను కలెక్టర్ అంబేడ్కర్, జేసీ సేతు మాధవన్, డీఆర్‌ఓ ఎస్. శ్రీనివాసమూర్తి, కేఆర్‌సీ ఎస్డీసీ మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, నూకరాజు పరిశీలించారు. ఆయా సమస్యలను వీలైనంత వేగంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సమస్యలకు చట్టపరిధిలో పరిష్కారం
విజయనగరం క్రైమ్: జిల్లాపోలీస్ కార్యాలంయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల వేదికకు వచ్చిన ఫిర్యాదులను చట్టపరిధిలో పరిష్కరించాలని ఎస్పీ పకుల్‌జిందాల్ సిబ్బందిని ఆదేశించారు. డీపీవోలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని ఏడు రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. పీజీడీఆర్‌ఎస్ లో మొత్తం 46 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సౌమ్యలత, ఎస్‌బీ సీఐలు లీలారావు, చౌదరి, డీసీఆర్‌బీ సీఐ సుధాకర్, ఎస్సై రాజేష్‌లు పాల్గొన్నారు.
కూలికి వెళ్లి.. విగతజీవుడై..●
● విద్యుత్ షాక్‌కు గురై యువకుడి మృతి
తెర్లాం: కుటుంబ పోషణ నిమిత్తం కూలి పనికోసం వెళ్లిన ఓ యువకుడు విగతజీవుడయ్యాడు. పెళ్లిలో టెంట్లు, లైటింగ్ పనులు చేసేందుకు వెళ్లిన యువకుడికి విద్యుత్ షాక్ తగలడంతో మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి సోమవారం తెర్లాం ఎస్సై సాగర్‌బాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సింగిరెడ్డివలస పంచాయతీ పరిధి ఆమిటి సీతారాంపురం గ్రామానికి చెందిన కొత్తకోట చిరంజీవి(20) ఆదివారం కొల్లివలసలో జరిగిన ఓ వివాహానికి టెంట్లు, లైటింగ్ పనులు చేసేందుకు కూలికోసం వెళ్లాడు. పెళ్లి అయిన తరువాత టెంట్లు విప్పుతుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. చిరంజీవికి తండ్రి, ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉన్నారు. వారిని పోషించేందుకు పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాల్లో టెంట్లు, లైటింగ్ పనులు చేసేందుకు కూలికి వెళ్తుంటాడు. విద్యుత్ షాక్‌కు గురై యువకుడు మృతిచెందిన సమాచారం తెలియడంతో తెర్లాం ఎస్సై సాగర్‌బాబు సిబ్బందితో వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
పాచిపెంట: మండలంలో ని పద్మాపురం పంచా యతీ బడ్నాయక వలస గ్రామానికి చెందిన అంగర బోయిన లక్ష్మణరావు(31) బైక్ అదుపుతప్పి మృతి చెందాడు. ఈ ఘ టనపై ఎస్సై వెంకట సురేష్ సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లక్ష్మణరావు మద్యానికి బానిసై తరచూ భార్య ఉషారాణితో తగాదా పడుతూ ఉండేవాడు. రోజులాగానే ఆదివారం మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో తగాదాపడ్డాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన భార్య ఇంట్లో ఉన్న ఏవో మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను స్థానికులు సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. సాలూరులో చికిత్స పొందుతున్న భార్యను చూడడానికి లక్ష్మణరావు, ఆదివారం రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై సాలూరు వెళ్తుండగా పి.కోనవలస సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో లక్ష్మణరావుకు తీవ్ర గాయాలు కాగా 108 సహాయంతో విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు.
బైక్ ఢీ కొని వ్యక్తికి గాయాలు
కొమరాడ: మండలంలోని కంబవలస సచివాలయంలో డిజిటల్ సహాయకుడిగా పనిచేస్తున్న పి.శంకరరావు బైక్ ఢీకొని గాయాల పాలయ్యారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో లక్ష్మీపేట గ్రామానికి డిజిట్ అసిస్టెంట్ శంకరారావు వెళ్తుండగా జంఝావతి డ్యాం దాటిన వెంటనే గుర్తు తెలియని వ్యక్తి సారా కేన్లు బైక్‌తో తీసుకు వెళ్తూ మద్యం మత్తులో డిజటల్ సహాయకడు శంకరరావును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఆయన హెల్మెట్ పెట్టుకున్నందున ముఖం, చేతికి చిన్నపాటి గాయాలయ్యయి.
యువకుడి ఆత్మహత్య
సాలూరు: పట్టణంలోని డబ్బివీధికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లారీ క్లీనర్‌గా పనిచేస్తున్న గంట దినేష్(29) మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో సోమవారం మద్యానికి డబ్బులు ఇవ్వమని తల్లిని అడగగా, ఇంట్లో డ బ్బులు లేవని తెలిపింది. దీంతో మనస్తాపానికి గురైన దినేష్ ఇంటిలో సీలింగ్‌ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. మృతుడి తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.