మహానటి..

శ్రీకృష్ణుడి పాత్రలో కిలారి లక్ష్మి   - Sakshi

ఆమె పేరు వినగానే పౌరాణిక రంగ స్థల ప్రేక్షకుల మది పులకిస్తుంది. ఆమె నటించే పౌరాణిక నాటకాల్లోని పాత్రలు చూసేందుకు ప్రేక్షకులు ఎగబడతారు. టెక్నాలజీ వచ్చి సినిమాలు అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ గ్రామాల్లో పౌరాణిక నాటకాలకు ఆదరణ కొనసాగుతూనే ఉంది. మూడు తరాల కళాకారులతో నటించిన ఆమె గాత్ర మాధుర్యం, నటనాభినయం అద్భుతం. పురుష కళాకారులను అధిగమిస్తూ పౌరాణిక రంగస్థలంలో ఇప్పటికీ తరగని ఆదరణ సొంతంచేసుకుని కళారంగానికి వన్నెతెస్తున్న కళాకారిణి కిలారి లక్ష్మి. ఆమె స్వగ్రామం రాజాం. ఆరువేలకు పైగా పౌరాణిక కళా ప్రదర్శనలు ఇచ్చిన ఆమె పలు సత్కారాలు పొంది, ప్రేక్షకుల మదిలో మహానటిగా స్థానం సంపాదించింది.

–రాజాం

పారాణిక నాటక ప్రదర్శనల్లో వెలిగిపోతున్న కిలారి లక్ష్మి తెలుగు రాష్ట్రాలతో పాటు చుట్టు పక్కల రాష్ట్రాలకు కూడా చిరపరిచితురాలు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె చిన్నతనం నుంచే కళా ప్రదర్శనలు ఇచ్చేది. ఆడపిల్ల స్టేజీలపై ప్రదర్శనలేమిటని ప్రశ్నించినవారికి ఆదర్శ మహిళగా నిరూపించింఇ. తల్లిదండ్రులు ఆమైపె ఉంచిన నమ్మకాన్ని నిజంచేసేందుకు తన నటనకు కొత్త హంగులు దిద్దింది. పౌరాణిక నాటకాల్లో ఉండే సీ్త్ర పాత్రలే కాకుండా ఏకంగా పురుష పాత్రలు పోషించేది. ఔరా అనిపించేలా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. పౌరాణిక నాటకాల్లో అర్జునుడు, రాముడు, సత్యహరిశ్చంద్రుడు పాత్రలు వేసి అందరినీ మెప్పించింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు మండలం గూనభద్ర ఆమె జన్మస్థలం. తల్లిదండ్రులు లలితాదేవి, సత్యనారాయణలు కూడా కళాకారులే. వారిద్దరి దగ్గర అల్లారుముద్దుగా పెరిగిన లక్ష్మి నాటకాలపై మమకారం పెంచుకుని చిన్నతనంలోనే తల్లిదండ్రులతో పాటు లవకుశ పాత్రల్లోనూ, లోహితాస్యుడు పాత్రలోనూ నటించేది.

తొలి అడుగు రాజాం నుంచే..

ఇంటర్‌మీడియట్‌ చదువుతో సరిపెట్టుకున్న లక్ష్మి నాటకాలవైపు దృష్టి సారించి, ఆరంభంలోనే పెద్దపెద్ద కళాకారులతో నటించేది. ఆమె తొలి నాటక ప్రదర్శన రాజాం మండలం శ్యాంపురం గ్రామంలో జరిగింది. అక్కడ గ్రామ దేవత సంబరాల్లో సత్యహరిశ్చంద్ర నాటకంలో చంద్రమతిగా తొలి పద్యనాటక ప్రదర్శన ఇచ్చింది. వేలాదిమంది ఆరోజు అక్కడకు రాగా, చంద్రమతిగా పాత్రలో పరకాయప్రవేశం చేసి ఆద్యంతం కేరింతలు, చప్పట్లతో ప్రేక్షకుల మనసును గెలిచి తెలుగురాష్ట్రాల్లో తన పేరు మార్గోగేలా చేసింది.

కుటుంబసభ్యుల ప్రోత్సాహం

కిలారి లక్ష్మిలో పట్టుదల ఒక ఎత్తుకాగా, ఆమె భర్త చంటిబాబు సహకారం మరో కారణం. వివాహమైనంత వరకు చంద్రమతి పాత్రలు ఎక్కువగా పోషించిన ఆమె..భర్త ప్రోత్సాహంతో శ్రీరాముడు, కృష్ణుడు, అర్జునుడు పాత్రలు వేయడం ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, ఒడిశా, మద్రాస్‌ ప్రాంతాల్లో కూడా ఆమె అభినయం మంచి పేరును తెచ్చిపెట్టింది.

ఆరువేలకు పైగా ప్రదర్శనలు

ఎప్పుడో 27 సంవత్సరాల క్రితం స్టేజీపై అడుగుపెట్టిన లక్ష్మి ఇప్పటికీ నటనా జీవితాన్ని కొనసాగిస్తూనే వస్తోంది. తన గాత్రంపైనే నమ్మకం పెట్టుకున్న ఆమె ఇప్పటివరకూ 6 వేలకు పైగా నాటక ప్రదర్శనలు ఇచ్చింది. ఆమె ప్రస్తుతం రాజాంలోని వస్త్రపురికాలనీలో ఉంటున్నారు. ప్రదర్శన ఇచ్చిన ప్రతిచోటా ఆమెకు సత్కారాలు లభించాయి. నటగాన శిరోమణి, అభినవ చంద్రమతి, అభినవ సావిత్రి బిరుదులతో పాటు సువర్ణ ఘంటా కంకణం, 2016లో వెండి కిరీటం ఉత్తరాఽంధ్ర కళాకారులు బహుకరించారు. 2016లో కదుకూరి పురస్కారం లభించగా, నంది నాటక అవార్డులకు న్యాయ నిర్ణేతగా కూడా ఆమె వ్యవహరించారు.

పౌరాణిక నాటకాల్లో పురుష వేషధారణలో రాణింపు

27 సంవత్సరాలుగా నాటకరంగంలో సేవలు

6వేలకు పైగా ప్రదర్శనలు

పలు రాష్ట్రాల్లో గుర్తింపు

శ్రీరాముడిగా, అర్జునుడిగా పాత్రలో

పరకాయ ప్రవేశం

పట్టుదల ఉండాలి

ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రతిభఉంటుంది. పట్టుదలతో ప్రయత్నిస్తే అది సొంతమవుతుంది. నాకు ఆరంభంలో అవమానాలు ఎదురయ్యాయి. నా భర్తతో పాటు కుటుంబసభ్యులు ప్రోత్సహించారు. నా గాత్రాన్ని, ప్రతిభను నమ్మాను. దేవుడు కరుణించాడు. ప్రేక్షకులు ఆదరించారు. తెలుగు పౌరాణిక రంగస్థల చరిత్రలో కిలారి లక్ష్మి పేరుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ జన్మకు ఇది చాలు.

కిలారి లక్ష్మి, పౌరాణిక రంగస్థల కళాకారిణి




 

Read also in:
Back to Top