గుంటూరు ఎడ్యుకేషన్: ఆగమ శాస్త్రంలో విశేషమైన కృషి చేసి వాటిపై పరిశోధనాత్మక పుస్తకాలు రాసిన సందర్భంగా బెంగళూరులోని ‘శ్రీవిద్య ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్’ నుంచి గుంటూరు నగరానికి చెందిన ఆమంచి విజయభాస్కర శాస్త్రి మంగళవారం గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. వర్సిటీ కులపతి జే శ్రీనివాసమూర్తి, రిజిస్ట్రార్ ఎస్‌ఆర్ నరసింహమూర్తి చేతుల మీదుగా సత్కారం పొందారు. డాక్టర్ విజయభాస్కర్ శాస్త్రి మాట్లాడుతూ అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ ఆఫ్ వేదిక సైన్సెస్ అనుబంధంగా ఉన్న బెంగళూరు శ్రీవిద్య వేదిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయం వారు తమంత తాము గుర్తించి ఈ డాక్టరేట్‌ను అందజేశారని తెలిపారు. గౌరవ డాక్టరేట్ అందుకున్న డాక్టర్ విజయ భాస్కర్‌శాస్త్రి, కరుణశ్రీ దంపతులకు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, మైలవరపు శ్రీనివాసరావు, సామవేదం షణ్ముఖ శర్మ, అన్నదానం చిదంబర శాస్త్రి, పలువురు పీఠాధిపతులు, అర్చక సంఘాలు, బ్రాహ్మణ పరిషత్తులు అభినందనలు తెలిపారు.


