రాజ్యాంగ పరిరక్షణలో పోలీసులు ముందుండాలి
నరసరావుపేట రూరల్: రాజ్యాంగ పరిరక్షణలో పోలీసు అధికారులు, సిబ్బంది ముందుండాలని జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవి సంతోష్ తెలిపారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చిత్రపటం వద్ద అదనపు ఎస్పీ సంతోష్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలో అత్యుత్తమ ప్రజాస్వామిక రాజ్యాంగాలలో ఒకటని తెలిపారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడిన రోజు గుర్తుగా ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు వివరించారు. రాజ్యాంగం చట్టపరమైన పుస్తకం మాత్రమే కాదని, దేశ పరిపాలన మార్గదర్శక గ్రంథమని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు పాటించాల్సిన విలువలు, హాక్కులు, బాధ్యతలు గ్రంథంలో పొందుపరిచారని వివరించారు. అనంతరం అదనపు ఎస్పీ(ఏఆర్) సత్తిరాజు అధికారులు, సిబ్బందితో రాజ్యాంగ ప్రమాణం చేయించారు.


