మాచర్లలో గంజాయి స్వాధీనం
12 మంది అరెస్టు వివరాలు వెల్లడించిన గురజాల డీఎస్పీ జగదీష్
మాచర్ల: పట్టణంలో గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, 12 మందిని అరెస్టు చేసినట్లు గురజాల డీఎస్పీ జగదీష్ చెప్పారు. మాచర్ల పట్టణ పోలీసుస్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. పట్టణంలో గంజాయి వ్యాపారం జరుగుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 15 రోజులుగా ప్రత్యేక నిఘా పెట్టారు. సోమవారం రాత్రి పశువుల ఆసుపత్రి వెనుక పలువురు గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో పట్టణ ఎస్‌ఐ ఎం వెంకట్రావు, తహసీల్దార్ కిరణ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో దాడి నిర్వహించి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.40వేల విలువైన నాలుగు కిలోల గంజాయితోపాటు గంజాయి విక్రయించగా వచ్చిన మరో రూ.3వేల నగదు, ఆరు హషీఫ్ ఆయిల్ బాటిల్స్‌ను స్వాధీనపర్చుకున్నారు. మొత్తం రూ.52వేల విలువైన సామగ్రితోపాటు ఇందుకు మూల కారకులైన 12 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుల్లో ఒకరు మైనరు ఉన్నారు. వీరంతా గతం నుంచే గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. వీరిలో ఎక్కువ మంది పాత నేరస్తులని తెలిపారు. పూర్తిస్థాయిలో గంజాయిపై దృష్టి సారించి వీరి ద్వారా గంజాయి విక్రయదారుల సమాచారం తీసుకొని పట్టణంలో గంజాయి లేకుండా అదుపు చేస్తామన్నారు. ఏ ఒక్కరైనా గంజాయి గురించి సమాచారమివ్వాలన్నారు. నిందితులందరినీ మాచర్ల కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ జగదీష్ చెప్పారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలన్నారు. గంజాయి నిందితులను పట్టుకున్న వారిలో కీలక పాత్ర వహించిన పట్టణ సీఐ వెంకటరమణ, ఎస్‌ఐలు వెంకట్రావు, బి అనంతకృష్ణ, పోలీసులను డీఎస్పీ అభినందించారు.
మాచర్లలో గంజాయి స్వాధీనం


