మహిళల హక్కులపై అవగాహన ముఖ్యం
నరసరావుపేట/నరసరావుపేట ఈస్ట్: మహిళలు తమ హక్కులతోపాటు చట్టాల గురించి తెలుసుకుంటే సమస్యల నుంచి తేలికగా బయటపడే అవకాశం ఉంటుందని పల్నాడు జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి ఎం.ఉమాదేవి పేర్కొన్నారు. మంగళవారం సీ్త్ర హక్కుల పరిరక్షణ, సీ్త్ర హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హెల్ప్ ఫౌండేషన్ (సత్తెనపల్లి) ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇలా కరపత్రాలను ముద్రించటం శుభ పరిణామం అన్నారు. సమస్య వచ్చినప్పుడు ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ఎదుర్కోవాలని పేర్కొన్నారు. మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యాలయ నోడల్ అధికారి అరుణ, హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కంచర్ల బుల్లిబాబు, సభ్యులు మురళీకృష్ణ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఓపెన్ స్కూల్ ఫీజు షెడ్యూల్ విడుదల
డీఈఓ చంద్రకళ
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2026 మార్చి నెలలో నిర్వహించనున్న 10వ తరగతి, ఇంటర్మీడియేట్ దూరవిద్య (ఓపెన్ స్కూల్) పరీక్షలకు హాజరు కావాలనుకునే వారు ఫీజును డిసెంబర్ 1 నుంచి 10వ తేదీలోగా చెల్లించవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ మంగళవారం తెలిపారు. రూ.25 అపరాధ రుసుంతో డిసెంబర్ 11, 12వ తేదీలలో, రూ.50 అపరాధ రుసుంతో డిసెంబర్ 13, 14, 15వ తేదీలలో చెల్లించవచ్చని పేర్కొన్నారు. 10వ తరగతికి రూ.100, ఇంటర్మీడియేట్ (థియరీ)కి రూ.150, ప్రాక్టికల్స్‌కు రూ.100 చెల్లించాలని వివరించారు. ఫీజును ఏపీ ఆన్‌లైన్ సేవా కేంద్రం, ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా నేరుగా చెల్లించవచ్చని తెలిపారు. ఫీజు, సబ్జెక్ట్ వివరాలు సరిచూసుకోవాలన్నారు. దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉందని, ఆన్‌లైన్ సేవాకేంద్రంలో సేవా రుసుం చెల్లించి తగిన రసీదు పొందాలని సూచించారు.
ఏపీ పంచాయతీ
కార్యదర్శుల సంఘం సమావేశం
యడ్లపాడు: పంచాయతీ కార్యదర్శుల సంక్షేమమే లక్ష్యంగా తమ సంఘం పనిచేస్తుందని ఏపీ పంచాయతీ కార్యదర్శుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం.రమేష్ బాబు పేర్కొన్నారు. మండలంలోని మైదవోలు గ్రామంలో ఓ ప్రైవేటు భవనంలో సోమవారం రాత్రి కమిటీ సమావేశం నిర్వహించారు. రమేష్‌బాబు ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం సముద్రపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి సిరిపురం హరిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. నియామక పత్రాన్ని హరికి అందించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. సాంబశివరావు, టి.మోహన్ రావు, ఇ.శంకరరావు, షేక్ ఫాతిమాబీ, షేక్ రమీజ్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీలతోపాటు పలువురు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మహిళల హక్కులపై అవగాహన ముఖ్యం


