టీ స్టాల్ యజమాని హత్య
తెల్లవారుజామున కత్తులతో దాడి
క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించిన స్థానికులు
చికిత్స పొందుతూ మృతి
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
నరసరావుపేట రూరల్: పట్టణంలోని చిలకలూరిపేట రోడ్డులో టీ స్టాల్ నిర్వహిస్తున్న ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. సోమవారం తెల్లవారుజామున టీ స్టాల్‌లో పనిచేస్తుండగా గుర్తుతెలియని ఇరువురు ఘాతకానికి పాల్పడ్డారు. హత్యలో ఓ మహిళ కూడా పాల్గొన్నట్టు పోలీసులు సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు ద్వారా నిర్ధారించారు. పట్టణంలోని కొండలరావుపేటకు చెందిన షేక్ బాజి (35) గతంలో టీ స్టాల్‌లో మాస్టర్‌గా పనిచేస్తుండేవాడు. ఎస్‌ఆర్‌కేటీ కాలనీ సమీపంలోని చిలకలూరిపేట రోడ్డులో తానే సొంతగా టీ స్టాల్ ప్రారంభించాడు. తెల్లవారుజామున 6 గంటల సమయంలో టీ స్టాల్ తెరిచి పనిచేస్తుండగా ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు అక్కడకి వచ్చి బాజీపై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న బాజీని గుర్తించిన స్థానికులు లింగంగుంట్లలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తలపైన, ఛాతీపైన బలమైన గాయాలు ఉన్నాయి. సమాచారం అందుకున్న రూరల్ సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ కిషోర్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని బంధువుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పల్నాడు రోడ్డులోని ఏరియా వైద్యశాలకు తరలించారు.
దాడిలో పాల్గొన్న మహిళ
బాజీ హత్య కేసు దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు మృతుడి భార్య, బంధువుల నుంచి అనుమానితుల వివరాలు సేకరించారు. దీంతోపాటు ఘటనా స్థలానికి సమీపంలోని సీసీ పుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. సీసీ పుటేజ్‌లో హత్యలో ఇరువురు పాల్గొన్నట్టు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ఇద్దరిలో ఒకరిని మహిళగా గుర్తించినట్టు తెలిసింది. మృతుని భార్య జబీనా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ సీఐ సుబ్బారావు తెలిపారు.


