హత్య కేసులో నిందితుల అరెస్టు
నరసరావుపేట టౌన్: స్వల్ప వివాద నేపథ్యంలో ఓ వ్యక్తిని కాళ్లతో, చేతులతో విచక్షణరహితంగా దాడి చేసి హతమార్చిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నరసరావుపేట ఇన్‌చార్జి డిఎస్పీ ఎం. హనుమంతరావు తెలిపారు. డిఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఈపూరు మండలం అంగుళూరు గ్రామానికి చెందిన అచ్చు కట్ల రాంబాబు ఈనెల 10వ తేదీ సాయంత్రం వినుకొండ పట్టణంలో నిందితులు ఓ మద్యం షాపు వద్ద ఉండగా దారిన పోతూ ఉమ్మి వేశాడని దాంతో తమను చూసి ఉమ్మి వేసినట్లుగా వాళ్లు భావించి వివాదానికి దిగారన్నారు. ఈ నేపథ్యంలో రాంబాబు నిందితులలో ఒకరిపై చేయి చేసుకోవడంతో నలుగురు కలిసి రాంబాబుపై విచక్షణరహితంగా కాళ్లు చేతులతో దాడి చేశారన్నారు. తీవ్ర గాయాలపాలైన రాంబాబు చికిత్స పొందుతూ 13వ తేదీ వినుకొండ ప్రభుత్వ వైద్యశాల్లో మృతి చెందాడన్నారు. గుండె, లివర్‌లపై తగిలిన బలమైన దెబ్బలతోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు. ఈ ఘటనకు సంబంధించి లభ్యమైన సీసీ ఫుటేజ్ ఆధారంగా వినుకొండ పట్టణానికి చెందిన పల్లె మరియబాబు, పల్లె వినయ్‌లతో పాటు మరో ఇద్దరు మైనర్ యువకులు దాడిలో పాల్గొన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో వినుకొండ పట్టణ సీఐ బలగాని ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు.


