చోరీల మిస్టరీని ఛేదించిన పోలీసులు
నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్
నిందితుల నుంచి రూ.80 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం
నరసరావుపేట, వినుకొండ ప్రాంతాల్లో ఆరుచోట్ల చోరీలు
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు
నరసరావుపేటరూరల్: నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో వరుస చోరీల మిస్టరీని పోలీసులు ఛేదించారు. చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.80 లక్షల విలువైన బంగారు వస్తువులు, ఆటో, ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు వివరాలు వెల్లడించారు. నరసరావుపేట వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రకాష్‌నగర్ ఆర్‌అండ్‌బీ ఆఫీసు సమీపంలో నివసిస్తున్న గడిపూడి సుబ్బారావు దంపతులు ఈనెల 4వ తేదీన ఇంటికి తాళాలు వేసి రాజుపాలెం మండలం గణపవరం గ్రామంలోని తమ కుమార్తె వద్దకు వెళ్లారు. ఈనెల 9వ తేదీన తిరిగి వచ్చే సరికి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులకొట్టి బంగారు నగలు దొంగిలించారు. దీనిపై కేసు నమోదు చేసి వన్‌టౌన్ పోలీసులు సీఐ ఎస్‌కే టి ఫిరోజ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్, డాగ్ స్కాడ్ పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఇంటి సమీపంలోని సీసీ టీవీ పుటేజ్‌ను పరిశీలించి నలుగురు నిందితులను గుర్తించారు. నరసరావుపేట బరంపేటకు చెందిన పేరేచర్ల వంశీ, మాచర్లకు చెందిన బండారు బాలయ్య, నరసరావుపేట పెదచెరువుకు చెందిన వేముల తిరుపతిరావు, మీసాల రాజేష్‌లను ఈనెల 20వ తేదీన గురువారం అరెస్ట్ చేశారు.
కూలి పనులు చేసుకుంటూ రెక్కీ
చోరీ కేసులు పోలీసులు అరెస్ట్ చేసిన నలుగురు నిందితులపై ఇప్పటి వరకు ఎటువంటి నేరచరిత్ర లేదని ఎస్పీ కృష్ణారావు తెలిపారు. భవన నిర్మాణ పనుల్లో నలుగురు కూలీలుగా పనిచేస్తుంటారని వివరించారు. పనులకు వెళ్లే సమయంలో తాళాలు వేసి ఉన్న ఇంటిని గుర్తించడం తరువాత రెక్కీ నిర్వహించి రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. ఆరు నెలల్లో ఆరు చోరీలకు నలుగురు ముఠా పాల్పడినట్టు తెలిపారు. నరసరావుపేట టూటౌన్, నరసరావుపేట వన్‌టౌన్, నరసరావుపేట రూరల్‌లో రెండు, వినుకొండలో రెండు చోరీలకు ఈ ముఠా సభ్యులు పాల్పడ్డారని వివరించారు.


