న్యాయస్థానం, ప్రభుత్వ నిర్ణయాలే శిరోధార్యం
యడ్లపాడు: న్యాయస్థానం, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ప్రకారమే యడ్లపాడు లూథరన్ పాఠశాల భవిష్యత్ కార్యాచరణ ముందుకు సాగుతుందని రాష్ట్ర మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్, యాక్టింగ్ చైర్మన్ డాక్టర్ జాషువా డానియల్ తెలిపారు. రిటైర్డ్ కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్, ఏఈఎల్‌సీ అడ్మినిస్ట్రేటర్ జోసఫ్ పీఎస్, రిటైర్డ్ జిల్లా జడ్జి, ఏఈఎల్‌సీ సెక్రటరీ కంట్రోలర్ జేసు రత్నకుమార్, ఏఈఎల్‌సీ అసిస్టెంట్ ప్రాపర్టీ ఆఫీసర్ డి లెనిన్ గురువారం స్థానిక లూథరన్ హైస్కూల్‌ను సందర్శించారు. పాఠశాల సమస్యలను జేసు రత్నకుమార్, హెచ్‌ఎం బీఎస్ పద్మలత వారికి వివరించారు. జిల్లా డీఈవో ఎల్ చంద్రకళ, పాఠశాల విద్య జిల్లా ఏడీ–2 ఉదయభాస్కర్, యడ్లపాడు తహసీల్దార్ జెట్టి విజయశ్రీ నుంచి పాఠశాలకు సంబంధించిన చట్టపరమైన అంశాలను తెలుసుకున్నారు. విద్యా, రెవెన్యూశాఖ అధికారులతో కలిసి పాఠశాల భవనం, ఆట స్థలం, వెనుక ఉన్న ఖాళీ స్థలాలను స్వయంగా పరిశీలించి సంబంధిత వివరాలు సేకరించారు. అనంతరం మీడియాతో డాక్టర్ జాషువా డానియేల్ మాట్లాడుతూ పునరుజ్జీవనానికి అవసరమైన చర్యలపై సమగ్ర ప్రణాళిక అవసరముందని కమిటీకి సూచించారు. పాఠశాల బలోపేతానికి విద్యార్థుల చేరిక కీలకమని, విద్యార్థులు లేకపోతే విద్యాశాఖ, ప్రభుత్వం నుంచి చట్టపరమైన సహాయం అందించే అవకాశాలు తగ్గుతాయని అన్నారు. తాను కూడా లూథరన్ విద్యాసంస్థలో చదివిన విద్యార్థిగా, పాఠశాల అభివృద్ధికి వ్యక్తిగతంగా, మైనారిటీ కమిషన్ ద్వారా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల చేరికల ప్రక్రియను చేపడితే పాఠశాల తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీవైఈవో ఎస్‌ఎం సుభాని, సర్వేయర్ గేరా సురేంద్రనాథ్, వీఆర్వోలు, ఉపాధ్యాయులు ఉన్నారు.
రాష్ట్ర మైనారిటీ కమిషన్
వైస్ చైర్మన్ డాక్టర్ జాషువాడానియల్
లూథరన్ హైస్కూల్ సందర్శన


