విద్యార్థులు గ్రంథాలయాన్ని సందర్శించాలి
నరసరావుపేట ఈస్ట్: విద్యార్థులు ప్రతి రోజూ కొంత సమయాన్ని గ్రంథాలయానికి కేటాయించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ సూచించారు. పల్నాడురోడ్డులోని శాఖా గ్రంథాలయంలో గురువారం ఏర్పాటు చేసిన 58వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశంలో డీఈఓ చంద్రకళ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు కథలు, సాంస్కృతిక, చరిత్ర పుస్తకాలను చదవటం వలన పాఠ్యపుస్తకాలలో లేని ఎన్నో విజ్ఞాన అంశాలను తెలుసుకోవచ్చని వివరించారు. కథల పుస్తకాలు చదవటం ద్వారా నీతి తెలుసుకుంటారని వివరించారు. పుస్తకాలు చదువుతున్నప్పుడు జీవితంలో ఏదో సాధించాలనే కోరిక కలుగుతుందని తెలిపారు. గ్రంథాలయంలో సభ్యత్వం పొంది నచ్చిన పుస్తకాన్ని ఇంటికి తీసుకవెళ్లి చదవాలని సూచించారు. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవటం ద్వారా ప్రేరణ పొందుతారని తెలిపారు. జిల్లా ఔషధ నియంత్రణ అధికారి డి.సునీత మాట్లాడుతూ గ్రంథాలయాల ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లు వాడకం తగ్గించి గ్రంథాలయాన్ని సందర్శించి పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవటం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని వివరించారు. వారోత్సవాల లో భాగంగా నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక, విజ్ఞాన పోటీలలో విజేతలకు బహుమతులు అందించా రు. గ్రంథాలయాధికారి యడ్లపాటి రాధ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో అభ్యుదయ భారతి అధ్యక్షుడు రత్నాకరం రాము, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.


