
మా పొట్ట కొడితే కచ్చితంగా పాపం తగులుతుంది !
సత్తెనపల్లి: తమ పొట్ట కొడితే కచ్చితంగా పాపం తగులుతుందని సబ్‌స్టేషన్లలో తొలగించిన షిఫ్ట్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సత్తెనపల్లి మండలం కొమెరపూడి విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట సోమవారం తొలగించిన 13 మంది షిఫ్ట్ ఆపరేటర్లు మీడియా సమావేశంలో మాట్లాడారు. చల్లగుండ్ల సబ్ స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏ కారణంతో తొలగిస్తున్నారో నోటీసు ఇస్తే సంజాయిషీ చెప్పుకుంటామంటే పైనుంచి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని చెబుతున్నారన్నారు. అధికారుల సూచన మేరకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణను కలిసేందుకు 4, 5 సార్లు ప్రయత్నించినా పార్టీ ఆఫీస్ వద్ద అందుబాటులో లేకపోవడంతో గుంటూరు వెళ్లి 19 మంది ఆయన్ను కలిశామని తెలిపారు. ఉద్యోగాలు చేసుకోండని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చెప్పారన్నారు. తిరిగి ఏఈని కలిసి ఎమ్మెల్యే ఉద్యోగాలు చేసుకోమని చెప్పారని తెలియజేశామని వివరించారు.
రాజకీయ ఒత్తిళ్లు
రీజాయిన్ గురించి అడగటంతో ఏఈ మళ్లీ రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయని, పై వాళ్లను కలవమని చెప్పారన్నారు. గత ప్రభుత్వంలో తమ టాలెంట్ చూసి జాబు ఇచ్చినట్లు కృష్ణారెడ్డి తెలిపారు. ఇటీవల సత్తెనపల్లి సబ్‌స్టేషన్–3లో రాజకీయ నాయకులు మీడియా సమావేశం పెట్టరని, అక్కడికి వచ్చిన వాళ్లంతా డీఎన్‌ఆర్ దగ్గర బేరసారాలు కుదుర్చుకొని వచ్చారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో అంబటి రాంబాబును కోరితే ఉద్యోగం కల్పించారని, ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. కొత్త సబ్‌స్టేషన్స్ రావడంతో కొత్తగా జాబులు ఇచ్చారే తప్పా ఎవరినీ తొలగించి ఇవ్వలేదని తెలిపారు. సత్తెనపల్లి సబ్‌స్టేషన్–3లో కొత్తగా వచ్చిన షిఫ్ట్ ఆపరేటర్లు అంతా డీఎన్‌ఆర్ అంటున్నారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యం వచ్చిందని తెలివిగా డీఎన్‌ఆర్ అని చెబుతున్నారని, ఇక్కడ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణా లేక ఆయనో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ జాబులు చేసుకోమంటే డీఎన్‌ఆర్ ఆపుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయంపై సత్తెనపల్లి, నరసరావుపేటలో ధర్నాలు చేసి, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. ఉద్యోగాలు వచ్చే వరకు పోరాటం ఆగదని కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో తొలగించబడిన షిఫ్ట్ ఆపరేటర్లు వజ్రాల వీరారెడ్డి, చింతా సుధీర్‌బాబు, మాబు సుభాని, అన్నపరెడ్డి అఖిల్‌రెడ్డి, వెంకట రెడ్డి, పవన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, నాగరాజు, ఓర్సు నరసింహారావు మాట్లాడారు. కార్యక్రమంలో తొలగించిన షిఫ్ట్ ఆపరేటర్లు రవినాయక్, సుబ్బారావు, అబ్దుల్‌బాషా పాల్గొన్నారు.
గత ప్రభుత్వంలో రూపాయి తీసుకోకుండా ఉద్యోగాలు కల్పించారు
ఎమ్మెల్యే కన్నాలక్ష్మీనారాయణను
కలిస్తే పొట్ట కొట్టనన్నారు
మా ఉద్యోగాలతో
డీఎన్‌ఆర్‌కు సంబంధం ఏమిటి ?
కొమెరపూడి సబ్‌స్టేషన్ వద్ద మీడియాతో షిఫ్ట్ ఆపరేటర్ల ఆవేదన