
మున్సిపల్ కార్మికుల గోడు పట్టదా?
సత్తెనపల్లి: మున్సిపల్ ఇంజినీరింగ్ అవుట్ సోర్సింగ్ కార్మికుల ఆవేదనను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వీరి సమస్యల పరిష్కారానికి కనికరం చూపడం లేదు. పలుమార్గాల్లో నిరసనలు, ఆందోళనలు తెలిపినా కార్మికులకు గత్యంతరం లేక సమ్మెబాట పట్టారు. జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి, మాచర్ల, వినుకొండ, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల మున్సిపల్ కార్యాలయాల వద్ద గత 10 రోజులుగా ఇంజినీరింగ్ విభాగంలోని ఎలక్ట్రికల్, ప్లంబింగ్, వాటర్ వర్క్స్ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. పట్టణాల్లో రోడ్ల నిర్వహణ, తాగు నీరు, విద్యుత్ సరఫరాలో వీరి సేవలు కీలకం. వీరంతా సమ్మెలో ఉండడంతో పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
కూటమి ప్రభుత్వ వంచన...
తాము అధికారంలోకి వస్తే మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మేనిఫెస్టోలో కూటమి నాయకులు ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన తల్లికి వందనం పథకం వారికి అమలు చేయలేదు. జిల్లాలోని 8 పురపాలక, నగర పంచాయతీల్లో సుమారు 500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారంతా తల్లికి వందనం పథకానికి అర్హులైనా అమలు చేయలేదు.
సమ్మెలోనే మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు పది రోజులుగా వివిధ రూపాల్లో దీక్షలు, నిరసనలు ఉద్యోగ భద్రత, వేతనాల పెంపునకు డిమాండ్ సమస్యలను పట్టించుకోని కూటమి ప్రభుత్వం ఈనెల 12 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్న వైనం జిల్లాలోని 8 మున్సిపాల్టీల్లో 500 మంది ఇంజినీరింగ్ కార్మికులు
సత్వరమే సమస్యలు పరిష్కరించాలి
మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. గత నెల 25 నుంచి వివిధ రూపాల్లో నిరసనలు చేపడుతున్నాం. సమస్యలు పరిష్కారం కాకపోతే 12 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి. ప్రధానంగా ఉద్యోగ భద్రత, పనికి తగిన వేతనం లేదు. కొత్తగా చేరిన వారికి పాత వారికి ఒకే జీతం ఉండకూడదు. సర్వీస్ అర్హత గుర్తించి ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి.
– సిలార్ మసూద్, గౌరవాధ్యక్షుడు, మున్సిపల్ యూనియన్, పల్నాడు
ప్రధాన డిమాండ్లు
కార్మికులకు టెక్నికల్ జీతం రూ. 29,200, నాన్ టెక్నికల్ రూ. 24,500 అమలు చేయాలి.
కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం సంక్షేమ పథకాలు ఇవ్వాలి.
హెచ్‌ఆర్ పాలసీ పరిధిలోకి తీసుకురావాలి.
కార్మికులందరికీ మినిమం టైమ్ స్కేల్ వర్తింప చేయాలి. ఇంకా పలు డిమాండ్లు.

మున్సిపల్ కార్మికుల గోడు పట్టదా?