
కొండంత సంబరం
వినుకొండ: తొలిఏకాదశి పర్వదినం, వినుకొండ తిరునాళ్ల సందర్భంగా వినుకొండ కొండపైకి భక్తులు పోటెత్తారు. ఉదయం 6 గంటలనుంచే భక్తులు కొండపైకి చేరుకుని బాలాలయాలల్లో ఉన్న రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో కొండపైకి 40 బస్సులు ఏర్పాటు చేశారు. కొండపైన భక్తులకు తాగునీటి వసతి ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సేవాసంస్థలు, ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లి కార్జునరావులతోపాటు పలువురు పార్టీ నాయకులు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
● తిరునాళ్ల సందర్భంగా ఎన్‌ఎస్పీ గ్రౌండ్‌లో ఎలక్ట్రికల్ ప్రభలు ఏర్పాటు చేశారు. జూనియర్ కళాశాల ఆవరణలో సాంఘిక, పౌరాణిక నాటికలు, కోలాటాలు, చెక్క భజనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
● తిరునాళ్ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 400 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 300 మందికిపైగా మున్సిపల్, రెవెన్యూ, దేవదాయ సిబ్బంది సేవలందించారు. కొండకింద పోలీస్ కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశారు.
కోటప్పకొండపై ‘తొలి’ పూజల సందడి
నరసరావుపేట రూరల్: తొలి ఏకాదశి పర్వదినంపురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి త్రికోటేశ్వరుణ్ణి దర్శించుకొని తరించారు. తెల్లవారుజామున 4 గంటలకు అర్చకులు బిందెతీర్ధంతో స్వామి వారికి తొలి అభిషేకాలను నిర్వహించారు. పంచామృతాలు, ఫలాలు, విశేష ద్రవ్యాలతో స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం వైభవంగా జరిపారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేక అలంకరణ చేసి భక్తులను దర్శనానికి అనుమతించారు.
● ఉదయం కొండపై భక్తుల రద్దీ నెలకొంది. ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనంతో పాటు అభిషేక దర్శనాన్ని భక్తుల కల్పించారు. సోపానమార్గంలో మెట్ల పూజ చేసుకుంటూ కొండ మీదకి చేరుకొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు ఆలయం వెనుక రావిచెట్టు, మహనందీశ్వరుడి వద్ద దీపాలు వెలిగించారు. ధ్యానశివుడు, నాగేంద్రుడి పుట్ట వద్ద భక్తులు పూజలు నిర్వహించారు.
● కొండ మీద పార్కింగ్ స్థలం వాహనాలతో నిండిపోయింది. దీంతో పోలీసులు కొండదిగువనే వాహనాలను నిలిపివేశారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఘాట్‌రోడ్డులోని పార్క్ వద్ద యాత్రికుల సందడి నెలకొంది. కొండమీద పలు స్వచ్ఛంద సంస్థలు, దిగువున సత్రాలు వద్ద ఉచిత ప్రసాద పంపిణీ నిర్వహించారు. ఆలయ ఈఓ డి.చంద్రశేఖరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్వామి వారిని దర్శించుకున్నారు.
వినుకొండలో ఘనంగా కొండ పండుగ రామలింగేశ్వరుడికి విశేష పూజలు కొండపైకి పోటెత్తిన భక్తులు
భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి పూజలు
అఖండజ్యోతి ప్రజ్వలన
వినుకొండ కొండపైన అఖండజ్యోతి ప్రజ్వలన సాయంత్రం 6:30 నిముషాలకు జరిగింది. హిమాలయ బాబా భక్తులు జ్యోతిని వెలించారు. కొండపైన అఖండజ్యోతి చూసిన భక్తులు ఓం నమఃశివాయ అంటూ నినదించారు.

కొండంత సంబరం