
బైక్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు
హాలియా: అతివేగంగా దూసుకొచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన 565వ నంబర్ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా గురజాలకు చెందిన మోరం నాగేశ్వరరావు, ఆయన భార్య లక్ష్మీపార్వతి, 18 నెలల కుమారుడు అభిరామ్‌తో కలిసి శనివారం బైక్‌పై నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలంలోని రంగుండ్ల గ్రామంలో శుభకార్యానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ముగ్గురు కలిసి బైక్‌పై వెళ్తుండగా.. మార్గమధ్యలో అనుముల మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలోకి రాగానే హాలియా నుంచి సాగర్ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న హాలియా సీఐ సతీష్‌రెడ్డి, ఎస్‌ఐ సాయిప్రశాంత్ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 వాహనంలో సాగర్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితులను మాచర్లకు తరలించారు. క్షతగాత్రుల బంధువు లక్ష్మీకాంత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాయి ప్రశాంత్ తెలిపారు.