
త్రికోటేశ్వరా.. నిను చేరేదెలా?
నరసరావుపేట రూరల్: తొలిఏకాదశి పర్వదినాన కోటప్పకొండకు వచ్చిన భక్తులకు కొండ ఎక్కకుండానే దేవుడు కనిపించాడు. త్రికోటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఆదివారం అడుగడుగునా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొండ దిగువున పోలీసుల అతి జాగ్రత్త, కొండ మీద సిబ్బంది మధ్య సమన్వయ లోపం కారణంగా భక్తులు అవస్థలు పడాల్సి వచ్చింది.
ఓవర్ యాక్షన్‌తో తిప్పలు
తొలిఏకాదశి రోజున జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు స్వామి వారి దర్శనానికి వస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు కార్లు, సమీప ప్రాంతాల నుంచి వారు ద్విచక్రవాహనాలతో పాటు గ్రామాల నుంచి వచ్చే భక్తులు ట్రాక్టర్ల మీద కొండకు చేరుకుంటారు. కొండ మీద పార్కింగ్ సమస్య పేరుతో ఈ ఏడాది కొండ దిగువునే కార్లు, ట్రాక్టర్లను నిలిపివేశారు. ద్విచక్ర వాహనాలను కూడా అప్పుడప్పుడు వదిలారు. ఘాట్‌రోడ్డు వైపు వెళ్లే వాహనాలను ఎక్కడికక్కడ చెక్‌పోస్ట్‌లు పెట్టి అడ్డుకున్నారు. కొండకావూరు రోడ్డు ద్వారా పార్కింగ్ స్థలానికి మళ్లించారు. మహాశివరాత్రి పర్వదినాన మాత్రమే ఈ విధంగా ప్రైవేటు వాహనాలను కొండమీదకు అనుమతించరు. ఈ సారి పోలీసులు తొలిఏకాదశి రోజున కూడా వాహనాలను అనుమతించకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రైవేటు వాహనాలను అనుమతించకపోవడంపై పోలీసులు ముందస్తుగా భక్తులకు ఎలాంటి సమాచారం అందించలేదు. దీంతో వాహనాలపై వచ్చిన భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
అన్నదానం నిలిపివేత
భక్తులకు అన్నప్రసాదం అందించాల్సిన అన్నప్రసాదశాలను ఆదివారం మూసివేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మధ్యాహ్న సమయంలో అన్నప్రసాద శాలకు వెళ్లగా ఈ రోజు అన్నప్రసాద వితరణ నిలిపివేసినట్టు అక్కడి సిబ్బంది తెలిపారు. ఎందుకు నిలిపివేశారని భక్తులు ప్రశ్నించగా కేవలం సిబ్బందికి మాత్రమే ఈ రోజు అన్నప్రసాద వితరణ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు. ఆలయంలో నిత్యాన్నదానం జరుగుతున్నా పర్వదినాల్లో ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదానం నిలిపివేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కోటప్పకొండకు వచ్చే భక్తులపై పోలీసు ఆంక్షలు ఘాట్‌రోడ్డు వద్ద వాహనాలు నిలిపివేత భక్తుల తీవ్ర ఇబ్బందులు వీఐపీల సాకుతో లిఫ్ట్ నిలిపివేత వృద్ధుల పైనా కనికరం చూపని అధికారులు నిత్యాన్నదానం నిలిపివేతతో ఆకలితో వెనుదిరిగిన భక్తులు

త్రికోటేశ్వరా.. నిను చేరేదెలా?