
రైతుల నెత్తినే ప్రీమియం భారం
● ఉచిత పంటల బీమాకు కూటమి మంగళం ● ఐదేళ్లు రైతులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
యడ్లపాడు: కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు మంగళం పాడింది. గత రబీ సీజన్ నుంచే రైతులు నేరుగా బీమా ప్రీమియం చెల్లించుకోవాలని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో, ప్రీమియం భారం పూర్తిగా రైతులపై పడింది. అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు ముప్పేటా దాడి చేస్తున్న నేపథ్యంలో, ఈ ప్రీమియం భారం రైతులను మరింత కలవరపెడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందించే ఫసల్‌బీమా పథకం జిల్లాలో కేవలం మూడు పంటలకే మాత్రమే వర్తింపజేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
15లోగా ప్రీమియం చెల్లించాలి
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి 38,599 హెక్టార్లు, కంది 21,054, మిరప 55,786, పత్తి 91,566 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయనున్నట్లు అధికారులు అంచనాలు వేశారు. ఆయా పంటలు ఈ–క్రాప్‌లో నమోదైతే బీమా పరిధిలోకి వస్తాయి. పత్తి పంటకు ఈనెల 15వ తేదీలోగా ప్రీమియం చెల్లించాలి. మిరప, కంది పంటలకు ఈనెల 31వరకు, వరి పంటకు ప్రీమియం చెల్లించే అవకాశం ఆగస్టు 15 వరకు అవకాశం ఉంది.
అన్నదాతలకు అండగా గత ప్రభుత్వం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నదాతలకు అన్ని విధాలా అండగా నిలిచారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి పలు వ్యవసాయ పథకాలు పారదర్శకంగా అమలు చేశారు. వాటిలో పంటబీమా గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసి రైతుల తరఫున ప్రభుత్వమే బీమా ప్రీమియం కట్టింది. మొదట కేవలం రైతు భాగస్వామ్యంగా ఒక్కరూపాయి చెల్లించాలని చెప్పినా, ఆ తర్వాత దానికి కూడా తీసేసి రైతులపై పైసాభారం పడకుండా చూసింది.
దరఖాస్తు విధానం
రైతులు తమ పంటలను ఈ–పంటలో నమోదు చేసుకోవాలి. పంట రుణం తీసుకున్న రైతుల ప్రీమియంను బ్యాంకులు స్వయంగా మినహాయించుకుంటాయి. రుణం తీసుకోని అన్నదాతలు తమ సమీపంలోని మీ–సేవా, కామన్ సర్వీస్ సెంటర్లు, సచివాలయాలు, లేదా తమ ఖాతాలున్న బ్యాంకుల్లో నగదు చెల్లించవచ్చు. జాతీయ పంటల బీమా పోర్టల్‌లోనూ నేరుగా ప్రీమియం చెల్లించి నమోదు చేసుకోవచ్చు.
పంట ప్రీమియం(ఎకరాకు) బీమా మొత్తం (ఎకరాకు)
మిరప రూ.360 రూ.90,000
కంది రూ.40 రూ.20,000
వరి రూ.80 రూ.40,000
ప్రత్తి రూ.1900 రూ.38,000

రైతుల నెత్తినే ప్రీమియం భారం