అంతులేని గ్రావెల్‌ దోపిడీ | - | Sakshi
Sakshi News home page

అంతులేని గ్రావెల్‌ దోపిడీ

Jul 7 2025 6:17 AM | Updated on Jul 7 2025 6:17 AM

అంతుల

అంతులేని గ్రావెల్‌ దోపిడీ

చిలకలూరిపేట: గ్రావెల్‌ దోపిడీకి అంతులేకుండా పోతోంది. అది చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ప్రాంతమైనా... సమీపంలో గురుకుల విద్యార్థులకు హాని కలిగించే ప్రమాదం ఉన్నా.. అవేమీ పట్టని అక్రమార్కులు గ్రావెల్‌ దోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలోని పెద్దన్న పాత్ర పోషిస్తున్న నాయకుల కనుసన్నల్లో కొనసాగుతున్న గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై కూటమిలోని మరో భాగస్వామియైన జనసేన పార్టీ నాయకులే వ్యతిరేకించేంత స్థాయిలో వ్యవహారం కొనసాగటం విశేషం.

వందలాది ఎకరాల్లో తవ్వకాలు

చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు మండలంలో విస్తృత స్థాయిలో అసైన్డ్‌, అటవీ భూములు విస్తరించి ఉంటాయి. ముఖ్యంగా చెంఘీజ్‌ఖాన్‌పేట పంచాయతీ పరిధి నుంచి కొంతమేర కొండవీడు వరకు ఎర్రమట్టి నేలలు విస్తారంగా ఉంటాయి. కొండవీడు కొండల మధ్య రెడ్డి రాజుల కాలంలో రక్షణగా ఎర్రమట్టితో వేసిన అడ్డుకట్టను సైతం 2014–19 నాటి టీడీపీ ప్రభుత్వ కాలంలో తవ్వి గ్రావెల్‌ విక్రయాలకు పాల్పడ్డారు. తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ అక్రమ దందా విజృంభిస్తోంది. చెంఘీజ్‌ఖాన్‌పేట పంచాయతీ పరిధి నుంచి కొండవీడు కొండల సముదాయం పక్కన విస్తరించి ఉన్న వందలాది ఎకరాల భూముల్లో భారీగా గ్రావెల్‌ తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్‌ 28న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబంధిత స్థలానికి చేరుకొని గ్రావెల్‌ తరలించుకు పోతున్న లారీలను అడ్డుకున్నారు. మూడు టిప్పర్‌ లారీల డ్రైవర్ల నుంచి తాళాలు తీసుకొని యడ్లపాడు తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందికి అప్పగించారు. ఆరు పొక్లెయిన్లతో రాత్రి పగలు తేడా లేకుండా తవ్వకాలు నిర్వహించి టిప్పర్ల ద్వారా గ్రావెల్‌ తరలించి అమ్ముకుంటున్నారని వారు ఫిర్యాదు చేయడం గమనార్హం.

అత్యంత ప్రమాదకరంగా గోతులు

ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్‌ను ఇష్టారాజ్యంగా తవ్వడంతో సంబంధిత ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇదే ప్రాంతంలో ఉన్న గురుకుల పాఠశాల ముందు భాగంలో సైతం భారీగా తవ్వకాలు చేశారు. దీంతో ఆ ప్రాంతం అత్యంత ప్రమాదకరంగా మారింది. వర్షాకాలం భారీ వర్షా లు కురిస్తే ఆ ప్రాంతంలో నీరు నిలవడం ఖాయం. విద్యార్థులు తెలిసో తెలియకో ఈతకు దిగడం వంటివి చేస్తే ప్రమాదాల బారిన పడే అవకాశం లేకపోలేదు. ఇక్కడ ఒక టిప్పర్‌ లోడ్‌ చేసేందుకు రూ. 6,500 వసూలు చేస్తున్నట్లు స్థానికులు చెబు తున్నారు. దూరాన్ని బట్టి రవాణా చార్జీలు అదనంగా ఉంటాయి. ఆరు పొక్లెయిన్లతో తవ్వకాలు నిర్వహిస్తూ రాత్రి పగలు తేడా లేకుండా రోజుకు 200 నుంచి 250 లోడ్ల వరకు గ్రావెల్‌ తరలిపోతుంటుంది. ఇవి ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న క్రమంలో ఆదాయం మొత్తం ఎవరి చేతుల్లోకి పోతుందనేది జగమెరిగిన సత్యం. రెవెన్యూ, మైనింగ్‌, అటవీశాఖ అధికారులు కళ్లు మూసుకొని నిద్ర నటిస్తుండటం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని, అక్రమ గ్రావెల్‌ తరలింపును అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

వందలాది ఎకరాల్లో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు విక్రయాలు భారీ గుంతలతో చెరువులుగా మారుతున్న వైనం పర్యావరణానికి తీరని ముప్పు పట్టించుకోని అధికారులు

ఉన్నతాధికారులకు నివేదిస్తాం

తవ్వకాలు చేస్తున్నది అసైన్డ్‌ భూములా, లేక అటవీ భూములా అనేది విచారిస్తున్నాం. రెవెన్యూ, మైనింగ్‌, అటవీ, పోలీసు అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో విచారణ నిర్వహించి నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు అందిస్తాం.

– విజయశ్రీ, తహసీల్దార్‌, యడ్లపాడు

అనుమతులు లేవు

సంబంధిత ప్రాంతంలో గ్రావెల్‌ తవ్వకాలకు ఎవరికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. కొంతమంది దరఖాస్తు చేసుకొని ఉన్న మాట వాస్తవమే. అయితే ఎవరికి అనుమతులు మాత్రం ఇచ్చింది లేదు.

– నాగిని, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, మైనింగ్‌, పల్నాడు జిల్లా

అంతులేని గ్రావెల్‌ దోపిడీ1
1/2

అంతులేని గ్రావెల్‌ దోపిడీ

అంతులేని గ్రావెల్‌ దోపిడీ2
2/2

అంతులేని గ్రావెల్‌ దోపిడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement