
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
నరసరావుపేట: జిల్లాలో ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రసవాల సంఖ్య పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి పేర్కొన్నారు. శనివారం తన చాంబర్‌లో కమిటీ చైర్మన్ హోదాలో జిల్లా స్థాయి ప్రెగ్నన్సీ యాక్ట్–1971 అమలు తీరుతెన్నులపై సభ్యులతో కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ చట్టం కింద లీగల్‌గా అబార్షన్స్ చేసేందుకు రెండు దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిలో సక్రమంగా ఉన్న దరఖాస్తుదారులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మంజూరు చేసేందుకు కమిటీ ఆమోదం తెలియచేస్తుందన్నారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌ఓ రవి మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్ వైద్యశాలలు, ప్రైవేటు అల్ట్రా సౌండ్ స్కాన్ సెంటర్లు గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదన్నారు. అలా చేస్తే తీవ్ర నేరంగా పరిగణించి జరిమానా, జైలుశిక్ష, గుర్తింపు సర్టిఫికెట్లను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఏరియా హాస్పిటల్ గైనకాలజీ విభాగం అధిపతి డాక్టర్ కె.విజయలక్ష్మి, పీడియాట్రిషన్ డాక్టర్ బి.లక్ష్మణరావు, ఫిజీషియన్ డాక్టర్ ఎస్.గిరిరాజు, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు డి.శివకుమారి ప్రోగ్రాం ఆఫీసర్ డెమో కె.సాంబశివరావు పాల్గొన్నారు.
ప్రెగ్నెన్సీ యాక్ట్‌పై డీఎంహెచ్‌ఓ సమీక్ష