
యోగాతో ఆరోగ్యం.. ఆనందం
నరసరావుపేట: ప్రపంచానికి మనదేశం అందించిన గొప్ప విద్య యోగాను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పిలుపునిచ్చారు. రోజుకు 30 నిముషాలు యోగాకు కేటాయించడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. జూన్ 21న నిర్వహించే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా నెలరోజుల యోగాంధ్ర మాసోత్సవం బుధవారం సాయంత్రం స్థానిక డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడాప్రాంగణంలో వందలాది మందితో యోగా చేయడం ద్వారా జిల్లాలో లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ నేటి నుంచి నెలరోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 30 రోజుల పాటు యోగా సాధన చేయడం వల్ల అది ఒక అలవాటుగా మారుతుందనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.
భావోద్వేగాలు అదుపులో..
జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ యోగా సాధన ద్వారా మానసిక బలహీనతలు, ఉద్వేగాలు, ఉద్రేకాలను అదుపులో ఉంచుకోవచ్చన్నారు. యోగా సాధకులలో ఆత్మహత్యలు, అత్యాశతో అక్రమాలు చేయడం, దుర్బుద్ధితో వ్యవహరించడం కనిపించదన్నారు. యోగాంధ్ర వంటి సామూహిక యోగా కార్యక్రమం సమాజంలో ఐక్యతను పెంపొందిస్తుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి యోగాసనాలు వేయడంపై శిక్షణ ఇచ్చిన ప్రముఖ యోగా ప్రచారకులు కూనంశెట్టి వెంకట జనార్ధన్, యోగా బోధకులు ఆనంద రాముడు, డైట్ అధ్యాపకుడుఅజయ్ కుమార్‌లను శాలువాలతో జిల్లా కలెక్టర్, ఎస్పీలు సత్కరించి అభినందించారు. డీఆర్‌ఓ ఏకా మురళి, ఆర్డీఓ కె.మధులత, జిల్లా అధికారులు, యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు జిల్లాలో యోగాంధ్ర లాంఛనంగా ప్రారంభం