
క్రీడలతో దేహదారుఢ్యం
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
వెల్దుర్తి: క్రీడల వలన దేహదారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసం పెరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ అన్నారు. సోమవారం రాత్రి మండలంలోని శిరిగిరిపాడు గ్రామంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి పురుషులు, మహిళల వాలీబాల్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. మారుమూల ప్రాంతమైన శిరిగిరిపాడు గ్రామంలో జాతీయస్థాయిలో వాలీబాల్ పోటీలు నిర్వహించటం సంతోషకరమన్నారు. గ్రామానికి చెందిన కళ్లం హర్షవర్థన్‌రెడ్డి (ఐఆర్‌ఎస్), కళ్లం రామాంజనేయరెడ్డిల ఆధ్వర్యంలో జాతీయ స్థాయి మహిళల, పురుషుల వాలీబాల్ పోటీలు జరుపుకోవటం ఆనందదాయకమన్నారు. మారుమూల ప్రాంతంలో సైతం జాతీయ స్థాయిలో పోటీలు ఏర్పాటు చేయటం హర్షించదగ్గ విషయమన్నారు. క్రీడల పట్ల ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మాచర్ల నియోజకవర్గానికి చెందిన అంధుల క్రికెట్‌లో అజయ్‌కుమార్‌రెడ్డి జాతీయ స్థాయిలో రాణించగా జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో నీలంరాజు బంగారు పతకాన్ని సాధించటం నియోజకవర్గానికే గర్వకారణమన్నారు. నీలంరాజుకు వెయిట్ లిఫ్టింగ్ పరికరాల కోసం రూ 1.61 లక్షలు అందించటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధి కోసం ప్రతి హైస్కూల్‌కు రూ.30వేలను మంజూరు చేసిందన్నారు. మాచర్లలో క్రీడా వికాసం పథకానికి రూ.2 కోట్ల నిధులను మంజూరు చేయటం జరిగిందన్నారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడల చైర్మన్ రవినాయుడు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కుర్రి శివారెడ్డి, రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు ధారునాయక్, నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు.
కలుషిత ఆహారం తిన్న 20 మందికి అస్వస్థత
ఈపూరు (శావల్యాపురం): పల్నాడు జిల్లా ఈపూరు మండలం పెదకొండాయపాలెం గ్రామంలో కలుషిత ఆహారం తిన్న 20 మంది అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల కిందట గ్రామంలోని ఓ ఇంట్లో జరిగిన శుభకార్యంలో ఏర్పాటు చేసిన వంటలు తిన్న వీరంతా వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారుల సమాచారం మేరకు జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరరావు నాయక్, డీఎంహెచ్‌ఓ డి.రవికుమార్, తహసీల్దార్ నళిని, ఎంపీడీఓ ప్రభాకరరావులు గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించి బాధితులతో మాట్లాడి సత్వరమే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు ప్రశాంత్‌కుమార్, రాజశేఖర్ వైద్య ఆరోగ్య సిబ్బంది 70 కుటుంబాలను సర్వే చేసి విరేచనాలతో బాధపడేవారిని గుర్తించి వైద్యసేవలు అందించారు. అందరు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు.