
విద్యుత్‌షాక్‌తో రైతు దుర్మరణం
నాదెండ్ల: విద్యుత్ షాక్‌కు గురై రైతు దుర్మరణం పాలైన సంఘటన మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు చేకూరి హనుమంతరావు (70) తూబాడు రోడ్డులో తనకున్న వ్యవసాయ భూమిలో నర్సరీ నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం 3.30 సమయంలో తన పొలానికి వెళ్లి ఇనుప గేటు తీసే క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పొలం చుట్టూ రక్షణగా వేసిన ఇనుప కంచెకు విద్యుత్ వైరు తగిలి విద్యుత్ ప్రవహించినట్లు తెలుస్తోంది. దీంతో గేటు తీసే క్రమంలో షాక్‌కు గురైనట్లు భావిస్తున్నారు. ఈ పొలాన్ని కౌలుకు తీసుకున్న చంటి అనే వ్యక్తి సాయంత్రం 4 గంటల సమయంలో పొలానికి వెళ్లగా, విగతజీవిగా పడిఉన్న హనుమంతరావును చూసి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇరువురు కుమారులు ఉన్నారు.
లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్టు
పట్నంబజారు: మహిళపై లైంగిక దాడితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేసి గాయపరిచిన ఘటనపై నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. పాత గుంటూరు పోలీసు స్టేషన్ సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ వై.వీరసోమయ్య వివరాలు వెల్లడించారు. ఈనెల 12న మధ్యాహ్నం సుద్దపల్లి డొంక ప్రగతీ నగర్ 7వ లైనుకు చెందిన మహిళ తల్లి ఇంటికి వెళ్లింది. చుట్టుపక్కల ఎవరూ లేని సమయంలో అదే ప్రాంతానికి చెందిన షేక్ షాబాజ్ ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి అమ్మమ్మ రాహెలమ్మ రావడంతో ఆమెను నెట్టివేసి అక్కడి నుంచి షాబాజ్ పరారయ్యాడు. మరుసటిరోజు 13వ తేదీన నిందితుడు షాబాజ్, ఆయన మేనమామ నాగూల్ మీరా, బంధువులు నాసర్ హుసేన్, హనీఫ్‌లు మహిళ ఇంటి వద్దకు వెళ్లి, జరిగిన విషయాన్ని ఎవరికై నా చెబితే చంపుతామని బెదిరించారు. దీంతోపాటు కులం పేరుతో దూషించి వారి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితుడు షేక్‌షాబాజ్‌ను సోమవారం గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఎస్‌ఐ షేక్ అబ్దుల్ రహమాన్, సిబ్బందిని అభినందించారు. నిందితుడు షాబాజ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు.
పేదల ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
గుంటూరు వెస్ట్: పేదల ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని తన చాంబర్ నుంచి సోమవారం అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం ఒక ప్రభుత్వ శాఖతో వీలుపడదని, అన్ని శాఖల మండల, జిల్లా అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆయన సూచించారు. నిర్మాణానికి అవసరమైన సిమెంటు, ఇనుము అందుబాటులో ఉందని, ఇసుక కూడా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హౌసింగ్ లేఅవుట్లలో అప్రోచ్ రోడ్ల నిర్మాణం కోసం టెండర్లు పిలవాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేయాలని చెప్పారు.

విద్యుత్‌షాక్‌తో రైతు దుర్మరణం

విద్యుత్‌షాక్‌తో రైతు దుర్మరణం