
క్యాన్సర్ రోగులకు శుభవార్త
● జీజీహెచ్‌లో రూ. 18 కోట్లతో
పెట్ సీటీ స్కాన్ వైద్య పరికరం
● తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా
ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా అత్యాధునిక క్యాన్సర్ చికిత్సలు అందించేందుకు పెట్ సీటీ స్కాన్ వైద్య పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. క్యాన్సర్‌కు అత్యాధునిక చికిత్సలను ఉచితంగా అందించేందుకు నాట్కో ట్రస్టు చైర్మన్ వి.సి.నన్నపనేని సుమారు రూ. 50 కోట్లతో గుంటూరు జీజీహెచ్‌లో వంద పడకలతో ఐదంతస్తుల క్యాన్సర్ వార్డు నిర్మించారు. తాజాగా రూ. 20 కోట్లతో మరో క్యాన్సర్ భవన నిర్మాణం చేస్తున్నారు. ప్రతి ఏడాది రూ.కోట్లాది విలువైన క్యాన్సర్ మందులను సైతం నాట్కో ఫార్మా వారు ఉచితంగా అందజేస్తున్నారు. నాట్కో ట్రస్టు క్యాన్సర్ రోగులకు చేస్తున్న సేవలకు మరింత మెరుగైన వైద్యం అందించేలా సుమారు రూ. 18 కోట్లతో ప్రభుత్వం వైద్య పరికరాన్ని జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్‌కు అందజేసింది. క్యాన్సర్ శరీరంలో ఏ భాగంలో ఉంది, ఇతర భాగాలకు క్యాన్సర్ సోకుతుందా, లేక అక్కడే ఉందా, అనే పూర్తి విషయాలు తెలుసుకునేందుకు పెట్ సీటీ స్కాన్ వైద్య పరికరం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రైవేటు క్యాన్సర్ ఆసుపత్రుల్లో ఈ పరీక్ష చేయించేందుకు సుమారు రూ. 25 వేల వరకు ఫీజు తీసుకుంటున్నారు. జీజీహెచ్‌లో వైద్య పరికరం అందుబాటులోకి రావడం ద్వారా పేద క్యాన్సర్ రోగులకు మేలు చేకూరనుంది. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని నాట్కో ట్రస్టు వైస్ చైర్మన్ నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్టు కో ఆర్డినేటర్ యడ్లపాటి అశోక్‌కుమార్‌లు తెలిపారు.