
ఒంటికాలిపై సీహెచ్‌ఓల నిరసన
17వ రోజుకు చేరిన సమ్మె
నరసరావుపేట: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 17రోజులుగా సమ్మెచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు(సీహెచ్‌ఓ) బుధవారం శిబిరంలో ఒంటికాలిపై నిలబడి తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖలో గత ఆరేళ్ల నుంచి సీహెచ్‌ఓలుగా పనిచేస్తున్న వారు జీతభత్యాల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చాలని కోరుతూ పట్టణంలోని స్టేషన్‌రోడ్డు గాంధీపార్కుకు ఎదురుగా సమ్మెచేస్తున్న విషయం విధితమే. అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు అనుపమ మాట్లాడుతూ గత ఆరేళ్లుగా పనిచేస్తున్న తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, ఇతర ఉద్యోగులతో సమానంగా 23శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ప్రతి నెల జీతంతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలని, ప్రతి ఏడాది ఐదుశాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ఆర్థికమైన, ఆర్ధికేతర సమస్యలను తీర్చే విధంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం నెరవేర్చకపోతే ఈనెల 24 నుంచి శాంతియుత నిరవధిక సమ్మె ద్వారా నిరసనలు కొనసాగిస్తామన్నారు. తమ అసోసియేషన్ నాయకులను చర్చలకు పిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా నాయకులు సాగర్, రాము, మస్తాన్, వినోద్, ఏఐటీయూసీ నాయకులు కాసా రాంబాబు, ఉప్పలపాటి రంగ్గయ్య, గాంధీ స్మారక సమితి అధ్యక్షుడు ఈదర గోపీచంద్ పాల్గొన్నారు.