
చారిత్రక కట్టడం..మరమ్మతులకు సిద్ధం
● 130 ఏళ్ల చరిత్ర కల్గిన నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయం ● కార్యాలయ స్వరూపం మారకుండా మరమ్మతులు ● సేవలకు ఆటంకం కలగకుండా సర్వే కార్యాలయం నుంచి రెవెన్యూ సిబ్బంది విధులు
నరసరావుపేటటౌన్: బ్రిటిష్ హయాంలో నిర్మించబడి ప్రజలకు సేవలు అందిస్తున్న ఆర్డీఓ కార్యాలయానికి అధికారులు ఎట్టకేలకు మరమ్మతులు చేపట్టారు. సుమారు 130 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్డీఓ కార్యాలయం కాలగమనంలో శిథిలావస్థకు చేరింది. బ్రిటిష్ పాలనా కాలంలో 1894–95 సంవత్సరాల్లో నిర్మితమైన ఈ భవనం, అప్పటినుంచి ప్రజలకు రెవెన్యూ సేవలందిస్తూ, అధికార యంత్రాంగానికి కీలక కేంద్రంగా నిలిచింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా భవనం పైకప్పు పాక్షికంగా దెబ్బతింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో నరసరావుపేట రెవెన్యూ డివిజన్ అతి పెద్దది. ఎన్నో విలువైన రికార్డులు కార్యాలయంలో భద్రపరిచారు. సరైన రక్షణ చర్యలు లేక ఇప్పటికే కొన్ని రికార్డులు పాడయ్యాయి. ఈ క్రమంలో అధికారులు మరమ్మతులకు ఉపక్రమించారు.
వర్షం వస్తే ఇబ్బంది..
వర్షాకాలంలో సిబ్బంది తమ విధులను నిర్వర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీవర్షం వస్తే వర్షపు నీరు కార్యాలయంలోకి చేరుతుంది. దీంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంప్యూటర్లకు రక్షణ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, అధికారులు మరమ్మతులు ప్రారంభించారు. రెవెన్యూ సేవలకు అంతరాయం లేకుండా కొనసాగేందుకు, తాత్కాలికంగా సర్వే కార్యాలయం నుంచి సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. నిత్యం వందలాది ప్రజల అవసరాలకు నిలయంగా మారుతుండటంతో, భవన మరమ్మతుల తర్వాత మరింత సమర్థవంతంగా సేవలు అందించనుంది.
చరిత్రను కాపాడుతూ ఆధునిక పనులు
చరిత్రకు చిహ్నంగా ఉన్న కార్యాలయ స్వరూపాన్ని ఏమాత్రం మార్చకుండా అధునాతన టెక్నాలజీతో మరమ్మతులు చేపడుతున్నాం. కార్యాలయ ప్రాంగణంలో ఉన్న డివిజినల్ సర్వే కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండి సేవలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. అధికారుల పర్యవేక్షణలో త్వరతిగతిన మరమ్మతులు చేపట్టి కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం.
– కె.మధులత, నరసరావుపేట ఆర్డీఓ

చారిత్రక కట్టడం..మరమ్మతులకు సిద్ధం

చారిత్రక కట్టడం..మరమ్మతులకు సిద్ధం