నాదెండ్ల: నాదెండ్లలో కొలువైయున్న పురాతన ఆలయమైన శ్రీ గంగాపార్వతీ సమేత మూలస్థానేశ్వరస్వామి ఆలయ రథోత్సవంలో భాగంగా చివరిరోజు మంగళవారం పవళింపు సేవ నిర్వహించారు. మూడు రోజుల పాటూ జరిగిన బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగిశాయి. సోమవారం రాత్రి దొంగలదోపు, మంగళవారం ఉదయం పవళింపు సేవ, సాయంత్రం ప్రత్యేక రథంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ పూజారులు ఇర్లపాటి సాంబశివరావు, కాశీ విశ్వనాధశర్మ, వాసు, సురేష్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని రాత్రి వరకూ గ్రామోత్సవం నిర్వహించారు. తీర్ధప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు నల్లమోతు విజయసారధి, దేవదాయశాఖ ఈఓ జక్కా శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.
కొండవీడును ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి
కేంద్రమంత్రిని కోరిన ఎంపీ లావు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి
యడ్లపాడు: గొప్ప సాంస్కృతిక, చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన పల్నాడు జిల్లా యడ్లపాడులోని కొండవీడుకోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం సహకరించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసినట్లు తెలిపారు. ఏపీ రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న కొండవీడు ప్రాంతం ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యకలాపాలకు అనువైన ప్రదేశమన్నారు. ఇలాంటి ప్రాంతం అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కొండవీడు కోట సమగ్రాభివృద్ధిపై చర్చించినట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల ఆకర్షణే ధ్యేయంగా కొండవీడు కోటకు ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రాచుర్యాన్ని కల్పించాలని కోరినట్లు తెలిపారు.
ఏఈఎల్‌సీ అడ్మినిస్ట్రేటర్‌గా విశ్రాంత న్యాయమూర్తి జోసెఫ్
నెహ్రూనగర్: ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చి అడ్మినిస్ట్రేటర్‌గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు కేరళ రాష్ట్రానికి చెందిన విశ్రాంత న్యాయమూర్తి జోసెఫ్ పీఎస్ నియమితులయ్యారు. ఏఈఎల్‌సీ రాజ్యాంగం ప్రకారం ఆమోదించబడిన అన్ని పాలక మండలలు, కమిటీలు ఏర్పడే వరకు అడ్మినిస్ట్రేటర్ కంట్రోలర్‌గా జోసఫ్ వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ విశ్రాంత జూనియర్ జడ్జి నేలటూరి జేసు రత్నకుమార్ కంట్రోలర్ కార్యదర్శిగా నియమితులయ్యారు.
ఉండవల్లి కొండపై మంటలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఉండవల్లి కొండపై మంగళవారం రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టి ఉండవచ్చని, లేదా ఈ వేసవి ఎండల కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంటలు తీవ్రస్థాయిలో ఎగిసిపడుతుండడంతో దిగువ భాగాన నివాసముంటున్న వారు భయాందోళనలకు గురవుతున్నారు. సుమారు 2 గంటలపాటు వ్యాపిస్తూనే ఉన్నాయి. స్థానికులు ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందజేశారు. గతంలో ఇలాగే కొండలపై మంటలు చెలరేగాయని ఈ మంటల వల్ల కొండప్రాంతం తగలబడుతుందని స్థానికులు అంటున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మూలస్థానేశ్వరుడికి ప్రత్యేక పూజలు