
బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత
రేపల్లె: బాల్యవివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని సీడీపీఓ సుచిత్ర చెప్పారు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని ఉప్పుడి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కిశోరి వికాసం సమ్మర్ ప్రత్యేక క్యాంపులో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను గ్రామీణులకు తెలియపరచాలన్నారు.. యువతికి 18 ,యువకునికి 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు చేయాలని చెప్పారు. బాల్య వివాహాలు జరిపినా, ప్రోత్సహించినా చట్టరీత్యా నేరమన్నారు. అలా చేస్తే రూ. లక్ష జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని తెలియజేశారు. 2 సంవత్సరాలు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించడంతోపాటు ఐదు సంవత్సరాలు దాటిన వారిని పాఠశాలలకు పంపేలా బాధ్యత వహించాలన్నారు. బాల్య వివాహ నిషేధ చట్టం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం, విద్యా హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. కిశోరి బాలికలకు ఆటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ పి. నాంచారమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, బాలికలు తదితరులు పాల్గొన్నారు.