
ఆర్టీసీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి
ఎన్‌ఎంయూ ఆధ్వర్యంలో ‘ఛలో డీపీటీఓ’
నరసరావుపేట: ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే వన్ బార్ 2019 సర్క్యులర్‌ను అమలు చేయాలని ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా అపరిష్కతంగా ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో జిల్లాలో ఆరు డిపోలకు చెందిన అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు ‘ఛలో డీపీటీఓ’ కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు జిల్లా కార్యదర్శి మురహరిరావు, జిల్లా అధ్యక్షుడు వసంతరావుల ఆధ్వర్యంలో కార్యాలయం నుంచి ప్రారంభమైన ఉద్యోగులు డిపో చుట్టూ రెండుసార్లు ప్రదర్శన నిర్వహించి బస్టాండ్ ఆవరణలోని డీపీటీ జిల్లా కార్యాలయానికి ఎదురుగా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సర్క్యులర్‌కు విరుద్దంగా చేసిన ఉద్యోగుల సస్పెన్షన్‌లు, తొలగింపులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పదేళ్ల నుంచి చేపట్టని కిందిస్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని, ఖాళీలను భర్తీచేయాలని, ఎస్‌ఆర్‌బీసీ, డీఏ లాంటి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఎలక్ట్రానిక్ బస్సులను ఆర్టీసీ సంస్థకే అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ప్రజారవాణా అధికారి కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. జోనల్ సెక్రటరీ లుక్సన్, నరసరావుపేట డిపో అధ్యక్షుడు పి.శ్రీనివాసరావు, కార్యదర్శి టీవీ రెడ్డి, జాయింట్ సెక్రటరీ షేక్ కమాల్‌బాషతో పాటు జిల్లాలోని ఆరు డిపోలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.