
త్రికోటేశ్వరునికి లక్ష మల్లెలతో అర్చన
నరసరావుపేట రూరల్: వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారికి సోమవారం రాత్రి లక్ష మల్లెపూల అర్చనను వైభవంగా నిర్వహించారు. వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున మల్లెపూలలో స్వామివారికి అర్చన నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మహా ప్రదోష కాలంలో నిర్వహించిన అర్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా మల్లెపూలతో స్వామివారిని అర్చించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఆలయ ట్రస్టీ రామకృష్ణ కొండలరావులు అర్చనలో పాల్గొన్నారు. ఉదయం స్వామి వారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. ఆలయ ఈఓ డి.చంద్రశేఖర్, సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు.