
బాలల హక్కుల పరిరక్షణకు కృషి
నరసరావుపేట రూరల్: జవాబుదారితనంతో బాలల హక్కులను పరిరక్షించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి కోరారు. మండలంలోని జొన్నలగడ్డ, పెట్లూరివారిపాలెం, పమిడిపాడు, ఉప్పలపాడు గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను సోమవారం ఆమె తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న టీహెచ్‌ఆర్ టేక్ హోమ్ రేషన్ సక్రమంగా అందుతుందా లేదా ఆరా తీశారు. నాదెండ్ల మండలం సాతులూరులోని గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. పద్మావతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న పౌష్టికాహరాన్ని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించాల్సిన బాధ్యత ఐసీడీఎస్‌పై ఉందని చెప్పారు. ఎండల తీవ్రత దృష్ట్యా చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సరైన సమయంలో పాలు, గుడ్డు అందించాలని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను బావులకు దగ్గరగా ఉండకుండా చర్యలు తీసుకోవాలని మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. బాల్యవివాహాలు మీ పరిసరాల్లో జరగకుండా సిబ్బంది పర్యవేక్షించాలని తెలిపారు. కార్యక్రమంలో సీడీపీఓలు ఉమామహేశ్వరి, శాంతకుమారి పాల్గొన్నారు.